calender_icon.png 10 December, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ వచ్చింది

09-12-2025 08:08:13 PM

* కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

* హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ నాయకుల విజయ్ దివస్

హుస్నాబాద్: బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంగళవారం ఆ పార్టీ నాయకులు విజయ్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమై నేటికి 16 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధులు అయిలేని మల్లికార్జునరెడ్డి, సుద్దాల చంద్రయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాత్ర, పోరాటం, త్యాగం అనిర్వచనీయమన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే, కేవలం 11 రోజుల వ్యవధిలోనే అప్పటి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు డిసెంబర్ 9న ప్రకటించిందని గుర్తుచేశారు. కేసీఆర్ పోరాటం లేకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేది కాదన్నారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ ముద్ర స్పష్టంగా ఉందన్నారు. 

విమర్శలతోనే కాలం గడుపుతున్నరు..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల కాలంలో ప్రజల కోసం చేసిందేమీ లేదని, కేవలం కేసీఆర్ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు, అవినీతి ఆరోపణలు చేస్తూ కాలాన్ని వృథా చేస్తోందని విమర్శించారు. ఒక పథకం ప్రకారం కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఆయన ముద్రను తుడిచివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. "కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా, తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన త్యాగాన్ని ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు" అని అన్నారు. ఇప్పటికైనా అనవసరపు విమర్శలు మానుకొని, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని  హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు అన్వర్ పాషా, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఆకుల రజిత, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.