21 March, 2026 | 3:53 PM

'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని

21-03-2026 12:56 PM

హైదరాబాద్: 'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి' అని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Thanneeru Harish Rao) శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. ముందు చూపుతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి ప్రణాళికలు చేశామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సూచించారు. తాము సమకూర్చిన అన్నింటికీ మీరు శంకుస్థాపనలు చేస్తున్నారని తెలిపారు. ఆయుష్ ఆస్పత్రులను తామే ఏర్పాటు చేశామన్నారు. పీహెచ్ సీలు కూడా తానే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్(Election Code) వల్ల పీహెచ్ సీలు ప్రారంభించలేదని వివరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే జిల్లా జైలుకు భూసేకరణ చేసి.. నిధులు కేటాయించామని వెల్లడించారు. జిల్లా జైలు పూర్తయి రెండేళ్ల తర్వాత ఇప్పుడు మీరు వచ్చి ప్రారంభిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. 

బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రారంభించి, పూర్తైన వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రిబ్బన్ కటింగ్ చేస్తోందని హరీశ్ రావు ధ్వజమెత్తారు.  సిద్దిపేటలో ప్రారంభం కానున్న  ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి(Oil Palm Factory) 2021లో జీఓ ఇచ్చి, రూ. 300 కోట్లతో ఈ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించినట్లు హరీశ్ రావు పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రావడంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా కీలకమని ఆయన వెల్లడించారు. నర్మెటలో ప్రారంభం కానున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి కూడా ప్రతి సంవత్సరం 20 కోట్ల లీటర్ల కాళేశ్వరం జలాలే ఆధారమని సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) మీద అబద్ధపు చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఇప్పటికైనా సోయి తెచ్చుకొని అవాస్తవమైన ప్రచారాలు మానుకోవాలని హరీశ్ రావు హెచ్చరించారు. రైతులకు రుణమాఫీ(Runa Mafi ) చేస్తామని రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న ప్రతి దేవుడిపైన ఒట్లు వేశాడని, రేవంత్ వెళ్తున్న నర్మెట గ్రామంలో ఇంతవరకు 350 మంది రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని హరీశ్ రావు(Harish Rao) ఆరోపించారు. సిద్ధిపేట నియోజకవర్గంలో 22,819 మంది రైతులకు రూ. 300 కోట్ల బకాయి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధిపేట నియోజకవర్గంలో 52 శాతం రుణమాఫీ కాని రైతులు ఉన్నారని వివరించారు.