అధికారులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్
హైదరాబాద్: రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే అవ్వ, తాతలకు పింఛన్లు రెండు వేల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పారని బీఅర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గుర్తుచేశారు. పింఛన్లపై ఆధారపడిన అవ్వ, తాతలకు మూడు నెలల నుంచి పింఛన్లను ఎందుకు ఇవ్వడం లేదని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎవరినీ విడిచిపెట్టమని చెప్పిన ఆయన పార్టీ కంటే ఎవరూ పెద్ద కాదని ప్రతి ఎమ్మెల్యే గుర్తు పెట్టుకోవాలన్నారు. అటు అధికారులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అధికారులు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించిన ఆయన మీకోసం బ్లాక్ బుక్ రెడీ చేశానని తెలిపారు. ఏ అధికారి ఎక్స్‌ట్రాలు చేస్తున్నారో వాళ్ల పేర్లు బ్లాక్ బుక్‌లో ఎంటర్ చేస్తున్నానని పేర్కొన్నారు. రేపు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులకు అన్ని బ్లాక్ డేస్ ఏ ఉంటాయి జాగ్రత్త అన్నారు.






