04-05-2024 02:17:27 AM
నగర పాలకసంస్థ పరిధిలో త్వరలో అవిశ్వాస తీర్మానం?
ఖమ్మం, మే 3 (విజయక్రాంతి): ఖమ్మంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో జిల్లా రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు బీఆర్‌ఎస్‌లో కొనసాగిన నేతలు, ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. దీంతో బీఆర్‌ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఏం చేయాలో పాలుపోక నిశ్చేష్టులవుతున్నారు. ఇటీవల నగర డిప్యూటీ జోహారాతో పాటు మరికొందరు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజాగా శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో నగర మేయర్ నీరజ, ఆమె భర్త బ్రహ్మం, 11వ డివిజన్ కార్పొరేటర్ సరిపుడి రమాదేవి,13వ డివిజన్ కార్పొరేటర్ కొత్తపల్లి నీరజ కాంగ్రెస్‌లో చేరారు. మేయర్ దంపతులకు గతంలోనే మంత్రి తుమ్మల అనుచరులన్న పేరున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల కంటే ముందుగానే నగరపాలక సంస్థ పరిధిలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది.