18 August, 2026 | 12:16 AM

ప్రతి పనినీ ధ్యానంగా చేయాలి

24-05-2024 01:11 AM

బుద్ధుని సందేశమే శాంతికి మార్గం

ధ్యాన మందిరం కోసం నిధులు ఇస్తాం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మహా బోధి బుద్ధ విహార్ సందర్శన

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): సమాజంలో అసహనం, అసూయ పెరిగిపోతున్నాయని, స్పర్థలు, ఉద్వేగాలతో కూడిన వాతావరణం నెలకొని ఉందని.. ఈ పరిస్థితుల్లో బుద్ధుని సందేశం దేశానికి ఎంతో అవసరమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బుద్ధుని సందేశాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికీ చేరవేయడానికి అవసరమైన సహాయం తన వంతుగా చేస్తానని చెప్పారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా  సికింద్రాబాద్‌లోని మహా బోధి బుద్ధ విహార్‌ను సీఎం గురువారం సందర్శించారు. ప్రతి పనిని ధ్యానంగా చేయాలన్న సూచనలో  చాలా గొప్ప అర్థం ఉందని.. ఈ సూక్తి నుంచి తాను ఎంతో స్ఫూర్తిని పొందానని అన్నారు.

అందుకే తాను పనిచేసేప్పుడు ధ్యానంతో ఉంటానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మహాబోధి బుద్ధ విహార్‌కు రావడం గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన భావన కలుగుతోందని చెప్పారు. రాజ్యం, అధికారం ఉండి కూడా వాటన్నింటినీ కాదని 29 ఏళ్ల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచిం చాడని అన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ధ్యాన మందిరం కోసం ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇక్కడ ఓ పాఠశాలను నిర్వహించాలని ఆయన కోరారు. బుద్ధుని సందేశాన్ని సమాజానికి చేరవేసేందుకు సహాయ సహకారాలు ఎల్లప్పటికీ ఉంటాయని చెప్పారు. తెలంగాణలో బౌద్ధ బిక్షువులకు తగిన గౌరవం కల్పిస్తామని పేర్కొన్నారు.