మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మార్చిన అపర భగీరధుడికి అభినందనలు
మంత్రి ఉత్తమ్ సహకారంతో బీటీ రోడ్లు పూర్తి
మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
గరిడేపల్లి, మే 28,(విజయక్రాంతి): మండలంలోని గానుగబండ, కొండాయిగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు మంత్రి చిత్రపటానికి గురువారం పాలాభిషేకం చేశారు. గానుగుబండ గ్రామానికి చుట్టూ ఉన్న అన్ని గ్రామాలకు గతంలో మట్టి రోడ్లు మాత్రమే ఉన్నాయని, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి చొరవతో నేడు అన్ని మట్టి రోడ్లు కూడా తారు రోడ్లుగా మారాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ పైడిమరి రంగనాథ్, మండల పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామాగా నిలిచిన మంత్రి ఉత్తమ్ గరిడేపల్లి మండల సర్వతో ముఖాభివృద్ధి కి పాటుపడుతున్నారని తెలిపారు. మండలంలో అనేక గ్రామాలను కలిపి లింక్ రోడ్లన్నీ నేడు తారు రోడ్లు గా మార్చారని తెలిపారు.
మండలంలో గతంలో మంత్రిగా పనిచేసిన సమయంలోనే కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టిన మంత్రి ఇప్పుడు కోట్లాది రూపాయలు వెచ్చించి మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. గానుగ బండ నుంచి మఠంపల్లి మండలంలోని హనుమంతల గూడెం వరకు, గానుగ బండ నుంచి కల్మలచెరువు వరకు, గానుగ బండ నుంచి పరెడ్డిగూడెం వరకు ఉన్న మట్టి రోడ్లను తొలగించి బీటీ రోడ్లను ఏర్పాటు చేయడం తో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. మంత్రి ఉత్తం సహకారంతో మండలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో కొండాయిగూడెం గ్రామ సర్పంచ్ కందుల మంగమ్మ కోటిరెడ్డి, గానుగ బండ మాజీ ఎంపీటీసీ పాకాల పరమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు నాగేంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బచ్చలకూరి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఆరే కృష్ణారెడ్డి, వరలక్ష్మి, సతీష్, శ్రీను, గ్రామ పెద్దలు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






