నేటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు షురూ
మొత్తం 1066 కాలేజీల్లో 4,49,449 సీట్లు
హైదరాబాద్, మే 05 (విజయక్రాంతి): తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈరోజు (సోమవారం) నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి నూతనంగా దోస్త్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి సెల్ఫీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. విద్యార్థులు రూ.200 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 25వ తేదీ వరకు ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు మే 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. జూన్ 3వ తేదీన మొదటి విడత సీట్లను విద్యార్థులకు కేటాయిస్తారు. రాష్ట్రంలోని 1066 కాలేజీల్లో మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి.




