పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించండి
ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం
జిల్లా సిపిఐ నియోజకవర్గ ఇంచార్జ్ తోటపల్లి శంకర్
జవహర్ నగర్,(విజయక్రాంతి): పెంచిన గ్యాస్ ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని మేడ్చల్ నియోజకవర్గ సిపిఐ ఇన్చార్జ్ తోటపల్లి శంకర్ డిమాండ్ చేశారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ మున్సిపల్ ఆఫీస్ పరిధిలో బుధవారం కాప్రా మండల కార్యదర్శి దర్శనం యాదగిరి అధ్యక్షతన నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ నియోజకవర్గ సిపిఐ ఇన్చార్జ్ తోటపల్లి శంకర్ హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇంధన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని దేశంలోని సాధారణ ప్రజలపై పెరుగుతున్న జీవన వ్యయం భారం అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన ఇంధన ధరలు ఎల్పిజిల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగి దాని ప్రభావం నిత్యావసర వస్తువులపై పడుతోందని దీనివల్ల సామాన్య ప్రజలు రైతులు చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
ముఖ్యంగా మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం మరింతగా పెరిగిపోతుందని తమ ఆవేదన వెలుబుచ్చారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రజల ఆర్థిక శక్తిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని అంతేకాకుండా భవిష్యత్తులో ఇందన ధరల నియంత్రణ కోసం స్థిరమైన విధానాన్ని అమలు చేయాలని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
లేని పక్షంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నరసింహులు, గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి బి స్వరూప నాయక్, ఏఐటీయూసీ కాప్రా మండల అధ్యక్షులు అంబాల ఎల్లయ్య, కీసర మండల సహాయ కార్యదర్శి రవి నాయక్, రవితేజ, మహిళా సమైక్య నాయకురాలు మాధవి, ఎల్లమ్మ ,మల్లిక, కే. రవి నాయక్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు






