సింగరేణికి కార్పొరేట్ ఆస్పత్రి సాధ్యమే!
శ్యామ్ :
సింగరేణిలో కార్మికోద్యోగులకు మెరుగైన వైద్యానికి రిఫరల్ కోసం సంస్థ చేస్తున్న వ్యయం ఇప్పుడు సాధారణ సంక్షేమ ఖర్చు పరిధిని దాటుతోంది. రిఫరల్ కేసులకు సంబంధించి తొమ్మిదేళ్లలో ఏకంగా రూ.436.99 కోట్లకు పైగా వెచ్చించిన సంస్థ.. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే రూ.89.87 కోట్లు ఖర్చు చేసింది. రెండు, మూడు దశాబ్దాల్లో రిఫరల్ కేసుల ఖర్చు లెక్కలు తీస్తే వెయ్యి కోట్లు దాటి ఉంటుంది. రిఫరల్ కేసుల కోసం కోట్లాది రూపాయలను ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు చెల్లించే పరిస్థితి నెలకొంది.
ఇంత భారీ మొత్తాన్ని ఏటా పునరావృత వ్యయంగా కొనసాగించడంకంటే.. అదే నిధులను దశలవారీగా శాశ్వత వైద్య మౌలిక వసతుల నిర్మాణానికి మళ్లిస్తే ఎలా ఉంటుంది? సింగరేణి సొంతంగా అత్యాధునిక కార్పొరేట్ స్థాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తే కార్మికులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు భవిష్యత్తులో రిఫరల్ వ్యయాన్ని గణనీయంగా నియంత్రించే అవకాశం ఉండదా? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రాచర్చకు దారి తీస్తున్నాయి.
సొంత కార్పొరేట్ ఆసుపత్రి వద్దా?
రిఫరల్ వైద్యం ఒక్క ఏడాది సమస్య కాదు. కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వైద్య అవసరాలతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స ఖర్చులు పెరుగుతున్న కొద్దీ సంస్థపై ఈ భారం కూడా పెరిగే అవకాశం ఉంది. ఒకసారి చెల్లించిన రిఫరల్ బిల్లు సంస్థకు మళ్లీ ఆర్థిక ప్రయోజనం కలిగించదు. ప్రతి సంవత్సరం అదే తరహాలో నిధులు ఖర్చు చేయాల్సిందే. అయితే ఇదే మొత్తాన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగా మలిస్తే పరిస్థితి భిన్నంగా ఉండే అవకాశం ఉంది.
రిఫరల్ ఖర్చుకు బదులు సొంత వైద్య సామ్రాజ్యం ఎందుకు ఏర్పాటు చేసుకోవడం లేదనేది అసలు ప్రశ్న. కార్పొరేట్ ఆసుపత్రి నిర్మించడానికి సింగరేణిలో స్థలానికి కొదవలేదు. సింగరేణి దశలవారీగా పెట్టుబడి పెట్టి ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తే.. కార్మికులకు అవసరమైన అనేక రకాల వైద్య సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావచ్చు.
ముఖ్యంగా బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు ప్రమాదాలు, వృత్తి సంబంధిత అనారోగ్యాలు, దీర్ఘకాలిక చికిత్స అవసరాలు వంటి వాటిపై ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యవస్థ అందుబాటులోకి వస్తే ప్రతి చిన్న, మధ్యస్థ, అనేక ప్రత్యేక వైద్య అవసరాల కోసం ప్రైవేటు ఆసుపత్రులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఫలితంగా రిఫరల్ బిల్లుల రూపంలో వెళ్తున్న భారీ మొత్తాన్ని కూడా క్రమంగా నియంత్రించవచ్చు.
ఆదాయ వనరుగా మార్చవచ్చు!
సింగరేణి ఆసుపత్రిని కేవలం కార్మికుల కోసమే పరిమితం చేయాల్సిన అవసరం కూడా లేదు. కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ప్రాధాన్యతనిస్తూ.. మిగిలిన వైద్య సామర్థ్యాన్ని సాధారణ ప్రజలకు, ఇతర సంస్థల ఉద్యోగులకు, ఆరోగ్య బీమా ఉన్న రోగులకు నిర్దిష్ట రుసుముతో అందుబాటులోకి తీసుకురావచ్చు.
అలా చేస్తే ఇప్పటివరకు వైద్య విభాగంపై పడుతున్న వ్యయం భవిష్యత్తులో కొంతమేర ఆదాయంగా మారే అవకాశం ఉంటుంది. ఒకే పెట్టుబడితో కార్మికులకు అత్యుత్తమ వైద్యం.. రిఫరల్ ఖర్చుపై నియంత్రణ.. అదనపు వైద్య సేవల ద్వారా ఆదాయం.. ఇలా మూడు ప్రయోజనాలను సాధించే అవకాశం ఉంటుంది.
వైద్య రంగంలోకి ఎందుకు రాదు?
సింగరేణి ఇప్పుడు కేవలం బొగ్గు ఉత్పత్తి, విక్రయాలకు పరిమితమైన సంస్థ కాదు. విద్యుత్ ఉత్పత్తి వంటి ఇతర రంగాల్లోకి కూడా విస్తరిస్తోంది. అంటే సంస్థ తన ప్రధాన కార్యకలాపాలకు అతీతంగా పెట్టుబడులు పెట్టి కొత్త రంగాల్లో సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. అలాంటి సంస్థకు వైద్య రంగాన్ని మాత్రం కేవలం సంక్షేమ వ్యయంగా చూడాల్సిన అవసరం ఏమిటన్నదే ప్రశ్న.
అవసరమైన చోట మాత్రమే అత్యంత ప్రత్యేక వైద్యం కోసం రిఫరల్ విధానాన్ని కొనసాగించవచ్చు. అంటే రిఫరల్ వ్యవస్థను పూర్తిగా తొలగించడం కాదు.. దానిపై ఆధారపడే పరిస్థితిని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉండవచ్చు. అదేవిధంగా కార్పొరేట్ ఆసుపత్రిని నెలకొల్పడం ద్వారా సింగరేణి ప్రత్యేకంగా వైద్య విద్య కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమం చేయవచ్చు.
పాట్నాలో సాధ్యం.. సింగరేణిలో ఎందుకు కాదు?
బీహార్‌లోని పాట్నాలో విద్యావేత్త ఖాన్ సర్ ఏర్పాటు చేసిన ఆసుపత్రిని ఉదాహరణగా తీసుకుంటే.. అత్యాధునిక వైద్య పరికరాలు, ఆధునిక డయాగ్నస్టిక్ సదుపాయాలతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉండే ధరల్లో వైద్య పరీక్షలు అందించాలనే ప్రయత్నం అక్కడ కనిపిస్తోంది. రక్త పరీక్షకు రూ.7, ఈసీజీకి రూ.25, ఎక్స్ రేరూ.35, సిటి స్కాన్, ఎంఆర్‌ఐ వంటి సేవలు తక్కువ ధరలు లభిస్తుండటం చర్చనీయాంశం అయ్యింది.
దీనిని అధికారికంగా ‘కార్పొరేట్ ఆసుపత్రి’గా పేర్కొనడం కంటే.. కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలను తక్కువ ఖర్చుతో అందించే ఆసుపత్రిగా అభివర్ణించవచ్చు. అత్యాధునిక సదుపాయాలు కేవలం అధిక చెల్లింపు చేసే వర్గాలకే పరిమితం కాకుండా సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలనే ఆలోచన ఇందులో కనిపిస్తోంది. వ్యక్తిగత ప్రయత్నంతో సాధ్యమైతే.. సింగరేణి సంస్థకు ఎందుకు సాధ్యం కాదనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
వ్యక్తిగత స్థాయిలో ఒక ప్రయత్నం అత్యాధునిక వైద్య పరికరాలతో తక్కువ ధరలకు వైద్య సేవలు అందించే దిశగా సాగుతున్నప్పుడు.. వేల కోట్ల రూపాయల కార్యకలాపాలు నిర్వహిస్తున్న సింగరేణి వంటి భారీ సంస్థకు మరింత పెద్ద స్థాయిలో అలాంటి వైద్య వ్యవస్థను నిర్మించడం ఎందుకు సాధ్యం కాకూడదని కార్మికవర్గం ప్రశ్నిస్తోంది.
సింగరేణి వద్ద ఇప్పటికే వైద్య విభాగం ఉంది. వైద్య మౌలిక వసతులు ఉన్నాయి. వైద్య సేవల కోసం ప్రతి ఏడాది భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తోంది. అంతేకాదు.. రిఫరల్ వైద్యం కోసం ఏటా దాదాపు కోట్లాది రూపాయలను ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు చెల్లిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా కాకుండా దశలవారీగా పెట్టుబడులు పెట్టి అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించే అంశాన్ని పరిశీలించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్






