16 August, 2026 | 1:49 AM

భద్రతలేని గిగ్ వర్కర్లు

16-08-2026 12:38 AM

తెలంగాణలో సుమారు 4.5 లక్షల మంది 

నెలకు సగటు ఆదాయం రూ. 20 వేలే..

  1. అదనంగా కమీషన్ల భారం 
  2. రోజుకు 10-12 గంటలు.. వారంలో ఏడు రోజులూ పనే 
  3. అన్యాయమైన ఛార్జీలతో ఆదాయానికి గండి
  4. సంక్షేమ బోర్డు, ప్రభుత్వ యాప్ ఏర్పాటు చేయాలని కార్మికుల డిమాండ్

* చేతిలో స్మార్ట్ ఫోన్.. బైక్‌పై పరుగులు.. యాప్‌లో ఆర్డర్ వస్తే  డెలివరీ.. రైడ్ వస్తే ప్రయాణికుడిని గమ్యానికి చేర్చడం. ఇది రోజువారీ గిగ్ వర్కర్ల జీవితం. అయితే నగర జీవనాన్ని వేగవంతం చేస్తున్న గిగ్ వర్కర్ల జీవితాలు మాత్రం రోజురోజుకూ అస్థిరంగా మారుతున్నాయి. ఆదాయంలో స్థిరత్వం లేకపోవడం, పెట్రోల్-డీజిల్ ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు, యాప్ సంస్థల కమీషన్లు, రేటింగ్-ఒత్తిడి, ప్రమాదాల ముప్పు, సామాజిక భద్రత లేకపోవడం  వంటి సమస్యలతో వారు  చాలా సతమతమవుతున్నారు. 

హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి) : తెలంగాణలో గిగ్‌ఎకానమీ వేగంగా విస్తరిస్తోంది. ఫుడ్ డెలివరీ, ఈ- కామర్స్, క్విక్ కామర్స్, క్యాబ్ సర్వీసులు, లాజిస్టిక్స్, హోమ్ సర్వీసులు వంటి రంగా ల్లో సుమారు 4.5 లక్షల మంది గిగ్ వర్క ర్లు పనిచేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల అంచ నా.

నగరాల్లో యువతకు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఈ రంగం.. సంప్రదాయ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. అయితే వర్కర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వారి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నా.. ఉద్యోగ భద్రత మాత్రం పెరగడం లేదనే ఆందోళన గిగ్ వర్కర్లలో వ్యక్తమవుతోంది.

ఆదాయం రూ. 20 వేలే..

గిగ్ వర్కర్లు రోజుకు 10-12 గంటల వరకు పనిచేస్తున్నప్పటికీ.. నెలకు సగటున రూ.20 వేల వరకు మాత్రమే ఆదా యం వస్తున్నట్లు ప్రభుత్వ అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇది స్థూల ఆదాయం మాత్రమే కాగా, పెట్రోల్, వాహన మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, మొబైల్ డేటా, ప్లాట్ ఫామ్ ఛార్జీలు, ఇతర ఖర్చులు పోగా చేతికి మిగిలే మొత్తం మరింత తగ్గిపోతోందని గిగ్ వర్కర్లు చెబుతున్నారు. రంగాల వారీగా చూస్తే ఆదాయంలోనూ భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.

ఈ-కామర్స్ డెలివరీ వర్కర్ల సగటు నెల ఆదాయం రూ.13,753, ద్విచక్ర వాహన రైడర్లకు రూ.16,138గా ఉన్నట్లు అధ్యయనంలో స్పష్టమైంది. ఫుడ్ డెలివరీ, ఫోర్ వీలర్ వాహన డ్రైవర్ల ఆదాయం సుమారు రూ.24-25 వేల మధ్య ఉండగా, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు సుమారు రూ.27 వేల వరకు సంపాదిస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఎక్కువ గంటలు పనిచేసినా.. ఖర్చులు పోగా తక్కువ ఆదాయం మిగలడం గిగ్ వర్కర్ల ప్రధాన సమస్యగా మారింది.

దీంతోపాటు గిగ్ వర్కర్లపై యాప్ సంస్థలు విధించే కమీషన్లు, వివిధ రకాల ఛార్జీలు అదనపు భారంగా మారుతుంది. కొన్ని విభాగాల్లో ప్లాట్ ఫామ్ ఛార్జీలు, కమీషన్లు 20-30 శాతం వరకు ప్రభావం చూపుతున్నాయని వర్కర్లు, కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో రోజుకు 10-12 గంటలు పనిచేసినా ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదని గిగ్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా కమీషన్లు, ఇన్సెంటివ్‌లు, రైడ్ లేదా డెలివరీ ఛార్జీలను సంస్థలు ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తున్నాయో తమకు స్పష్టంగా తెలియడం లేదని వర్కర్లు చెబుతున్నారు. ఛార్జీల విధానంలో పూర్తి పారదర్శకత తీసుకురావడంతో పాటు, కమీషన్లపై నియంత్రణ విధించి తమకు న్యాయమైన వాటా దక్కేలా చూడాలని, కనీస ఆదాయానికి హామీ, పారదర్శక చెల్లింపు విధానం, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 

రోడ్లపైనే జీవితం.. ప్రమాదాల ముప్పు..

గిగ్ వర్కర్లకు పని గంటలకు స్పష్టమైన పరిమితి లేకపోవడంతో రోజుకు 10-12 గంటల వరకు, వారంలో ఏడు రోజులూ పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్కువ సమయం యాప్‌లో ఆన్‌లైన్‌లో ఉండి ఆర్డర్లు, రైడ్లు పూర్తి చేస్తేనే ఆదాయం పెరుగుతుండటంతో విశ్రాంతికి కూడా సమయం దొరకడం లేదని వర్కర్లు చెబుతున్నారు.

పీక్‌అవర్స్‌లో ఆర్డర్లు, రైడ్లు పెరిగినా.. మిగతా సమయాల్లో పనికి అనుగుణంగా ఆదాయం తగ్గిపోతోంది. ఇన్సెంటివ్‌లు, బోనస్లు, రేటింగ్‌లు, ఆర్డర్ల సంఖ్య ఆధారంగా సంపాదన మారుతుండటంతో రోజంతా పనిచేసినా నెలవారీ ఆదాయంపై భరోసా లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఆరోగ్య సమస్యలు

మరోవైపు ఎక్కువ గంటలు రోడ్లపై తిరగడం వల్ల అలసట, రోడ్డు ప్రమాదాల ముప్పు, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఎండ, వర్షం, ట్రాఫిక్, రాత్రి వేళలు.. పరిస్థితి ఎలా ఉన్నా ఆర్డర్ లేదా రైడ్‌ను నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సిన ఒత్తిడి ఉంటుందని వర్కర్లు చెబుతున్నారు. సమయానికి చేరుకోవాలనే తొందరలో రోడ్డు ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదం జరిగితే సమస్య మరింత తీవ్రమవుతోంది. వైద్య ఖర్చులు, వాహనం మరమ్మతులు, పని చేయలేకపోవడం వల్ల కోల్పోయే ఆదాయం వంటి భారాలను ఎక్కువగా వర్కర్‌లే భరించాల్సి వస్తోంది. రోజువారీ సంపాదనపైనే కుటుంబాలు ఆధారపడుతున్న నేపథ్యంలో కొన్ని రోజులు పని చేయలేకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.

అనారో గ్యం లేదా ప్రమాదం కారణంగా పని చేయలేని సమయంలో ఆదాయ భద్రత లేకపోవ డం కూడా ప్రధాన సమస్యగా మారింది. ప్రతి వర్కర్‌కు తప్పనిసరి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, ప్రమాదంలో మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు పరిహారం, చికిత్స సమయంలో ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. 

91 శాతం మంది పురుషులే..

తెలంగాణ గిగ్ వర్కర్లలో సుమారు 91 శాతం మంది పురుషులే ఉన్నట్లు ప్రభుత్వ అధ్యయనంలో వెల్లడైంది. ఫుడ్ డెలివరీ, క్యాబ్, బైక్ రైడింగ్, ఈ-కామర్స్ డెలివరీ వంటి రోడ్డు ఆధారిత పనుల్లో పురుషులే అధికంగా ఉండటంతో గిగ్ రంగంలో మహిళల భాగస్వామ్యం పరిమితంగానే ఉంది. అయితే మహిళలు కూడా డెలివరీ, హోమ్ సర్వీసులు, ఇతర ప్లాట్ ఫామ్ ఆధారిత పనుల్లోకి వస్తున్నారు.

భద్రత, రాత్రి వేళల్లో పని, మరుగుదొడ్లు, విశ్రాంతి సౌకర్యాలు, వేధింపుల భయం వంటి అంశాలు మహిళా గిగ్ వర్కర్లకు అదనపు సవాళ్లుగా మారుతున్నాయి. మరోవైపు గిగ్-ఎకానమీ ప్రధానంగా 26-35 ఏళ్ల యువతకు ఉపాధి వేదికగా మారుతున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. తక్షణ ఆదాయం కోసం యువత ఈ రంగంలోకి వస్తున్నప్పటికీ.. దీర్ఘకాలిక ఉద్యోగ భద్రత, పెన్షన్, ఆరోగ్య బీమా, సామాజిక భద్రత వంటి ప్రయోజనాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పిస్తున్న రంగంగా గిగ్-ఎకానమీ ఎదుగుతున్న నేపథ్యంలో.. పురుషులతో పాటు మహిళా వర్కర్లకు కూడా సురక్షితమైన పని వాతావరణం, సమాన సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. గిగ్-ఎకానమీ దేశవ్యాప్తంగా కూడా వేగంగా విస్తరిస్తోంది. నీతి ఆయోగ్‌అంచనాల ప్రకారం 2020-21లో దేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య 77 లక్షలు ఉండగా.. 2029-30 నాటికి 2.35 కోట్లకు చేరే అవకాశం ఉంది.

దేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య కోట్లకు చేరే పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. వారి సంక్షేమానికి ప్రత్యేక విధానాలు, సామాజిక భద్రతా పథకాలు, కనీస ఆదాయ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. గిగ్-ఎకానమీ విస్తరణను కేవలం ఉపాధి అవకాశాల పెరుగుదలగా కాకుండా.. కోట్లాది మంది కార్మికుల భవిష్యత్తుతో ముడిపడిన అంశంగా చూడాల్సిన అవసరం ఉంది.

సంక్షేమ బోర్డు.. ప్రభుత్వ యాప్.. సామాజిక భద్రత.. 

తెలంగాణలో గిగ్ వర్కర్ల సంఖ్య సుమారు 4.5 లక్షలకు చేరిన నేపథ్యంలో వారి సంక్షేమానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్, ప్రసూతి ప్రయోజనాలు, ప్రమాద సమయంలో ఆదాయ సహాయం వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించాలని వారు కోరుతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి తమతో సమావేశమై గిగ్ వర్కర్ల సంక్షేమానికి పలు హామీలు ఇచ్చారని జేఏసీ నేతలు గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ తీసుకురావడం వంటి హామీలు ఇచ్చినా.. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గిగ్ వర్కర్ల ఉపాధి ప్రధానంగా ప్రైవేట్ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడి ఉంది.

కమీషన్లు, ఛార్జీలు, ఇన్సెంటివ్‌ల మార్పులు, రేటింగ్‌లు, అకౌంట్ డీయాక్టివేషన్ వంటి నిర్ణయాలపై వర్కర్లకు పరిమిత నియంత్రణ మాత్రమే ఉంటోందని జేఏసీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ తీసుకొచ్చి, వర్కర్లకు నేరుగా ఆర్డర్లు, రైడ్లు అందేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా మధ్య వర్తిత్వ ఛార్జీలు తగ్గి, వర్కర్లకు మెరుగైన ఆదాయం దక్కే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి.. ప్రభుత్వం, ప్లాట్ ఫామ్ సంస్థలు, ఇతర సంబంధిత వర్గాల నుంచి నిధులు సమీకరించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ప్రతి వర్కర్‌కు ప్రత్యేక రిజిస్ట్రేషన్ కల్పించి, డిజిటల్-ఐడీ, బీమా, పెన్షన్, ప్రమాద పరిహారం వంటి ప్రయోజనాలను అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉపాధి కల్పించడం మాత్రమే కాకుండా.. ఆ ఉపాధికి భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని గిగ్ వర్కర్లు స్పష్టం చేస్తున్నారు. సంక్షేమ బోర్డు, ప్రభుత్వ యాప్, సామాజిక భద్రతా వ్యవస్థలను త్వరగా అమలు చేస్తేనే లక్షలాది గిగ్ వర్కర్లకు న్యాయం జరుగుతుందని కోరుతున్నారు.

అన్యాయమైన ఛార్జీలతో.. 

గిగ్ వర్కర్ల ఆదాయం, పని అవకాశాలపై యాప్ రేటింగ్‌లు, అల్గారిథమ్ నిర్ణయాలు కీలక ప్రభావం చూపుతున్నాయని వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ ఇచ్చే రేటింగ్, ఆర్డర్-అంగీకరణ శాతం, క్యాన్సిలేషన్ వంటి అంశాల ఆధారంగా ఆర్డర్లు, రైడ్లు, ఇన్సెంటివ్‌లు మారుతున్నాయని చెబుతున్నారు. తక్కువ రేటింగ్ వచ్చినా, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయినా ఆర్డర్లు తగ్గడం లేదా ఇన్సెంటివ్‌లు కోల్పోయే పరిస్థితి ఉంటుందని వర్కర్లు అంటున్నారు.

గిగ్ వర్కర్ల ఆదాయంపై యాప్ సంస్థలు విధించే వివిధ రకాల ఛార్జీలు, కమీషన్లు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఒక రైడ్ లేదా డెలివరీకి కస్టమర్ చెల్లించే మొత్తంలో వర్కర్కు దక్కే వాటా ఎంత? సంస్థకు వెళ్లే కమిషన్‌ఎంత? ఏ ప్రాతిపదికన ఛార్జీలు, ఇన్సెంటివ్లు నిర్ణయిస్తున్నారో స్పష్టత లేకపోవడం సమస్యగా మారిందని వర్కర్లు అంటున్నారు. ఛార్జీలను తరచూ మార్చడం, ఇన్సెంటివ్ నిబంధనల్లో మార్పులు చేయడం వల్ల రోజువారీ ఆదాయాన్ని ముందుగా అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఎక్కువ పని.. తక్కువ మిగులు అన్న పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. యాప్ సంస్థలు విధించే ఛార్జీలు, కమీషన్లపై పూర్తి పారదర్శకత తీసుకురావడంతో పాటు, వర్కర్‌కు కనీస చెల్లింపు హామీ ఇవ్వాలని వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి రైడ్, డెలివరీలో వర్కర్‌కు దక్కే మొత్తం ముందుగానే స్పష్టంగా చూపించాలని, అన్యాయమైన ఛార్జీలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని