16 August, 2026 | 4:34 AM

వంద శాతం రుణమాఫీ జరిగిందా?

16-08-2026 12:18 AM
  1. గన్‌మన్లు లేకుండా నీ ఊరికి వస్తా
  2. అక్కడ నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా
  3. రుణమాఫీ, ఉచిత కరెంట్, రీయింబర్స్‌మెంట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా?
  4. సీఎంకు హరీశ్‌రావు సవాల్

సిద్దిపేట, ఆగస్టు 15 (విజయక్రాంతి): సంగారెడ్డిలో స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి చిల్లర మాటలతో పచ్చి అబద్ధాలు ఆడటం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివా రం మీడియా సమావేశంలో ఆయన మా ట్లాడారు.

కేసీఆర్ ప్రభుత్వం 2022 14,743 కోట్లు రైతుబంధు ఇస్తే, రేవంత్‌రెడ్డి 2024--25లో కేవలం 5,557 కోట్లు, 2025--26లో 11 వేల కోట్లు మాత్రమే ఇ చ్చారని, రెండు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి 15 వేల కోట్లు ఎగ్గొట్టారని విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తానని దేవుడి మీద ఒ ట్టు పెట్టి మోసం చేసిన ఘరానా మోసగాడు రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. ‘నా ఛాలెం జ్ స్వీకరించే దమ్ముంటే.. గన్ మెన్లు లేకుం డా నీ ఊరికి వస్తావా రేవంత్‌రెడ్డి.

నీ ఊళ్లో అందరికీ రుణమాఫీ జరిగిందని తేలితే నేను అక్కడే రాజీనామా చేస్తా. లేదంటే నువ్వు చే స్తావా? అని సవాల్ చేశారు.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చారు. సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి కరెక్టుగా సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు ప్రసంగం ప్రారంభించి, పూర్తిగా 420 మాటలే మాట్లాడారు’ అని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ సంగారెడ్డి జిల్లా సాగునీటి కోసం ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ఈ మూడేళ్లలో మూలకు పడేశారని, వాటి గురించి కనీసం ఒక్క ము క్క కూడా సీఎం మాట్లాడలేదన్నారు. ‘అసెంబ్లీలో కొత్త రేషన్ కార్డుల గురించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 6,47,479 రేషన్ కార్డు లు ఇచ్చారని, 20 లక్షల మందికి లబ్ధి చేకూరిందని చెప్పారు.

అసెంబ్లీలో తాను అడిగిన ప్రశ్నకు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని చెప్పారని, కానీ సభలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెపుతున్నారంటూ విమర్శించారు. నిరుద్యోగులను మోసం చేసినందుకు సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీని తీసుకొ చ్చి అశోక్ నగర్ లైబ్రరీ సాక్షిగా హామీ ఇచ్చారని, దమ్ముంటే గన్ మెన్లను వదిలేసి అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్, ఓయూ దగ్గరికి వస్తారా? అని సవాల్ చేశారు.

గత రెండున్నరేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా 30 లక్షల మంది విద్యా ర్థుల భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నామని సీఎం గొప్పలు చెపుతున్నారని, ఎక్కడ కూడా 10--11 గంటలకు మించి వ్యవసాయానికి త్రీ-ఫేస్ కరెంట్ రావడం లేదన్నారు. ‘యూరియా, డీఏపీ ఎరువులు దొరక్క రైతులు అరిగోస పడుతున్నారు.

యాప్ లో బుక్ చేద్దామంటే నర్మెట్ట, వెంకటాపూర్ లాంటి ఊర్ల పేర్లే యాప్ లో కనిపించడం లేదు’ అని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో దోపిడీ గురించి, కమీషన్ల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, సీనియర్ నేతలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్ స్వయంగా చెపుతున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డికి ధైర్యం ఉంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టి, రుణమాఫీ, రైతుబంధు, ఉద్యోగాలపై అసెంబ్లీ సాక్షిగా చర్చకు రావాలన్నారు.