16 August, 2026 | 1:46 AM

విధ్వంసం నుంచి వికాసం వైపు సంక్షేమమే లక్ష్యం

16-08-2026 12:43 AM
  1. దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టాం 
  2. తెలంగాణ జలాల వాటాల్లో రాజీ పడేది లేదు 
  3. రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం 
  4. 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ 
  5. ఉద్యోగాల కల్పన ప్రభుత్వ కీలక బాధ్యత 
  6. అన్ని రంగాల్లోనూ తెలంగాణ టాప్ అచీవర్ 
  7. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థలను ఒక్కొక్కటిగా గాడిలో పెట్టామని, సంక్షేమాన్ని విస్తరించామని తెలి పారు. అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించామని, తెలంగాణ భవిష్యత్తుకు అవసర మైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు.

స్వేచ్ఛ జీవనాధారం.. దానికి వెల కట్టలేం అని మహాత్మా గాంధీ అన్నారు.. అందుకే ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్చను అందించామన్నారు. మా ప్రభుత్వంలో సంక్షేమాన్ని ఆర్థిక కోణంలోనో, ఖర్చు పెట్టిన రూపాయలతోనో లెక్క కట్టడం లేదని,తమ సంక్షేమ ఆలోచనలో మానవీయత ఉందని పేర్కొన్నారు. పేదవాడి పట్ల బాధ్యత ఉందని, వారి జీవితాల్లో ఆనం దం నింపాలన్న తపన ఉందని, వారికి ఆరోగ్యవంతమైన జీవితాలను అందించే ప్రయత్నం ఉందన్నారు.

ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని అందించే సంక ల్పం ఉందని, ఓట్ల కోసమో, మొక్కుబడి హామీలుగానో తాము సంక్షేమాన్ని చూడ టం లేదన్నారు. ఈ 32 నెలల కృషి ఇప్పుడు ఫలితాల్లో కనిపిస్తోందని, ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం 2025- మన రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపు 91 శాతం అధికంగా ఉండటం మన ఆర్థిక వ్యవస్థ బలాన్ని చాటిచెప్పే గొప్ప విజయమని వెల్లడించారు.

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా సాధించే విషయంలో రాజీపడేది లేదని, అటు తుమ్మిడిహెట్టి నుంచి ఇటు పాలమూరు వరకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యక్రమంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధం మన స్వాతంత్య్ర పోరాటమని, అహింస అనే ఆయుధంతో ఇంత గొప్ప విజయాన్ని సాధించవచ్చు అని రుజువు చేసిన ఘనత జాతిపిత మహాత్మాగాంధీకి దక్కుతుందన్నారు.

ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకోవడానికి తొలి ప్రధాని పం డిట్ జవహర్‌లాల్ నెహ్రూ బలమైన పునాదులు వేశారని, దేశం ఆధునిక భారతావ నిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి దార్శనికతను ప్రదర్శించారని గుర్తు చేశారు. ఆయన ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈరోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటున్నామని, హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం చేపట్టి అన్నిరంగాల సమగ్రాభివృద్ధికి కృషిచేసిన ఘనత నాటి ప్రభుత్వాలదన్నారు. 

రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత..

రైతుల కష్టాలు తీర్చి వ్యవసాయాన్ని పం డగ చేయాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ని చ్చిందని, అందులో భాగంగానే ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీచేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశామని, రైతు భరోసా కింద రూ.36 వేల కోట్ల కు పైగా పెట్టుబడి సాయం అందించామన్నారు.

తొమ్మిది రోజుల్లో దాదాపు రూ.9 వేల కోట్ల రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేశామని, సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించి రైతులకు అండగా నిలబడ్డామని, గడిచిన 32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపు రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో మన తెలంగాణ.. పంజాబ్‌ను దాటేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు.

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం కొత్త రికార్డు నెలకొల్పిందని, గత యాసంగిలో 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా 81.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. తెలంగాణలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరు లను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు.

ఇప్పటికే 335 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు ద్వారా మహిళలు రూ.11 వేలకోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. కల్యా ణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1.68 లక్షల మంది ఆడబిడ్డలకు సహాయం అందించేందుకు రూ.4,709 కోట్లు ఖర్చు చేశామ న్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.60,487 కోట్ల రుణాలు అందించామని, వడ్డీలేని రుణాల కింద రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ విడుదల చేశామని వెల్లడించారు.

మన మహిళ లు పాఠశాల యూనిఫాంలు కుడుతున్నారని, చీరలు తయారు చేస్తున్నారని, పెట్రోలు బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు  నిర్వహించడంతోపాటు ఆర్టీసీ బస్సులకు యజ మానులుగా మారారని చెప్పారు. తెలంగాణ మహిళలు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా వ్యాపారాల్లో విస్తరించాలనేది ప్రభుత్వం ఆకాంక్ష అని స్పష్టం చేశారు. 

15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ..

సన్నబియ్యం ఓ విప్లవాత్మకమైన, ఆరోగ్యానికి భరోసా ఇచ్చే పథకమన్నారు. సన్నబియ్యంతో బువ్వ తినడం మా హక్కు అని నమ్మకం కలిగించిన పథకమని తెలిపారు. 93 లక్షలకు పైగా కుటుంబాలు, దాదాపు 3.38 కోట్ల మంది ప్రజలను ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చామని, ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం భరోసానిస్తూ 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేశామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించి కొత్త సాంకేతికతతో రేషన్ పంపిణీలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచుతు న్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అంటే కేవలం అవి నాలుగు గోడలు, పైన శ్లాబు మాత్రమే కాదు. పేదల ఆత్మగౌరవ ఆనవాళ్లు అని, అందుకే పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. తొలి దశలో 4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, గిరిజనులు, చెంచులు, అత్యంత వెనకబడిన కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చామన్నారు.

రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు 43 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నామని, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు అందించే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులకు కొత్త ఫించన్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

సామాజిక న్యాయంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, దేశంలోనే  సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను పకడ్బందీగా నిర్వహించామని, దేశంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందన్నారు. 

ఉద్యోగులే కీలక భాగస్వాములు..

ప్రజా ప్రభుత్వ విజయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు కీలక భాగస్వాములని, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం నుంచి సంక్షేమ పథకాలను చివరి లబ్ధిదారుడికి చేర్చడం వరకు... పెట్టుబడులను ఆకర్షించడం నుంచి అన్ని రంగాల్లో  ప్రభుత్వ సేవలను విస్తరించడం వరకు ఉద్యోగులు, అధికారులు సహకారం కీలకమని ప్రశంసించారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెలా మొదటి తారీఖున జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామని, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా మొదటి తారీఖున జీతాలు చెల్లిస్తున్నామని, పేరుకుపోయిన రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను ప్రాధాన్య క్రమంలో చెల్లించామన్నారు.

ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో రూ.6000 కోట్లు విడుదల చేశాం. మిగిలిన పెండింగ్ బిల్లులను దశల వారీగా పరిష్కరిస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ ఎంప్లాయి హెల్త్ స్కీమ్ అమల్లోకి తెచ్చాం. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి  ఉందన్నారు. డిజిటల్ పాలనలోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, 36 సచివాలయ శాఖల్లో 100 శాతం ఈ- అమలు చేయడంతోపాటు దేశంలో తొలి పూర్తిస్థాయి డిజిటల్ కేబినెట్ నిర్వహించామని తెలిపారు.

టీ- ద్వారా భారత్ నెట్ రెండో దశలో 8,895 గ్రామ పంచాయతీలకు డిజిటల్ కనెక్టివిటీ విస్తరించామని, టీజీడెక్స్ ద్వారా 21 రంగాల్లో 52 ఏఐ ప్రాజెక్టులకు మద్దతు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ‘ప్రజావాణి’ ప్రారంభిస్తున్నామని, ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. త్వరలోనే ఆన్లైన్ ప్రజావాణి పోర్టల్‌ను ప్రారంభించి, రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా అర్జీలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తామని, వాటి పరిష్కార పురోగతిని ప్రత్యేక డాష్బోర్డు ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. 

విద్యా రంగంలో అనేక సంస్కరణలు.. 

పన్నెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణను ప్రజా ప్రభుత్వం ఆమోదించి, సుమారు కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్ర యోజనం కల్పించామని, నైపుణ్యం లేని కార్మికులకు కనీస నెలవారీ వేతనాన్ని రూ.16 వేలకు, సెమీ స్కిల్ కార్మి కులకు రూ.17 వేలకు, స్కిల్ కార్మికులకు రూ.18,500కు, హైలీ స్కిల్ కార్మి కులకు రూ.20 వేలకు పెంచామన్నారు.

దేశంలోనే ఆదర్శవంతంగా గిగ్ కార్మికుల సంక్షేమ చట్టం అమల్లోకి తెచ్చా మని, గిగ్ కార్మికులకు చట్టబద్ధ గుర్తిం పు, ప్రత్యేక సంక్షేమ బోర్డు, సంక్షేమ నిధి, సామాజిక భద్రత కల్పించే చట్టా న్ని తీసుకొచ్చామన్నారు. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణలో ఉద్యోగుల బాధ్య తను నిర్ధారించే ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. విద్యారంగంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు స్పష్టమైన ఫలితాలు ఇస్తున్నాయని, కేం ద్ర ప్రభుత్వం ప్రకటించే పర్ఫార్మెన్స్ గ్రే డింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ 28వ స్థా నం నుంచి 18వ స్థానానికి చేరుకుందన్నారు.

ప్రాథమిక దశ నుంచే నాణ్య మైన విద్యను అందించాలని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది. అందుకే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించి, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యకు కొత్త రూపం ఇస్తున్నామని పేర్కొన్నారు.

పేదరికం కారణంగా చదు వు ఆగకుండా విద్యార్థుల ఉన్నత విద్య కు బాసటగా నిలుస్తున్నామని, 11 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయంబర్స్ మెంట్ ద్వారా ఆర్థికసా యం అందించడంతోపాటు యాజ మాన్యాల ప్రమేయం లేకుండా ప్రతి విద్యా సంవత్సరం నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ఫీజు రీయంబర్స్ మెంట్ జమ చేసే విధానం అమల్లోకి తెచ్చామన్నారు. 

ఉద్యోగాల కల్పన ప్రభుత్వ కీలక బాధ్యత..

తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడాన్ని ప్రజా ప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుందని, ఇప్పటి వరకు ప్రభుత్వశాఖల్లో 72 వేలకుపైగా ఉద్యోగ నియామకాలను పూర్తి చేశామన్నారు. గ్రూప్--1, గ్రూప్-2, గ్రూప్--3, గ్రూప్--4, మెగా డీఎస్సీ నియామకాలు విజయవంతంగా నిర్వహించామని, నోటిఫికేషన్ ఇచ్చి ఆగిపోకుండా పరీక్షలు, ఫలితాలు, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించామన్నారు.

టీజీపీఎస్సీ ద్వారా 456 వివిధ పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని వెల్లడించారు. యువతకు విద్యతోపాటు నైపుణ్యం... నైపుణ్యంతో పాటు  ఉద్యోగం అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని,  ఇందులో ఇప్పటి వరకు 1,190 మంది అధునాతన నైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందగా, వీరిలో 838 మంది పేరొందిన కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారని, 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన జాబ్ మేళాల్లో 40 వేల మంది యువత పాల్గొనగా 5,700 మంది ఉద్యోగాలు సాధించారని తెలిపారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. వైద్యరంగంలో హైదరాబాద్ నిమ్స్ అరుదైన రికార్డులు సాధిస్తోందని, అత్యుత్తమ సేవలను అందిస్తోందన్నారు. ప్రభుత్వ వైద్యరంగంలో దక్షిణ భారత తొలి రోబోటిక్ రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా నిమ్స్‌లోనే జరగడం ఇందుకు నిదర్శనమన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలను పకడ్బందీగా నిర్వహిస్తూ తెలంగాణను పెట్టుబడులు, పరిశ్రమలు, అంతర్జాతీయ కార్యక్రమాలకు సురక్షిత గమ్యస్థానంగా నిలుపుతున్నామని, డ్రగ్స్, ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపడంతోపాటు డ్రగ్స్ ముప్పు, ఆహార కల్తీని ఎదుర్కొనేందుకు కొత్తగా టీజీ సేఫ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక లీగల్, ల్యాబొరేటరీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల సమన్వయంతో విస్తృత తనిఖీలు చేసి కల్తీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీ క్రమబద్ధీకరించడంతో పాటు హైవేలు, ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు తగ్గించేందుకు కొత్తగా టీజీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేసుకున్నామని, మహిళలు, పిల్లలు, యువత భద్రతపై షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు, భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. 

తెలంగాణ టాప్ అఛీవర్..

హైదరాబాద్ చుట్టూ దాదాపు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 6,092 కిలోమీ టర్ల హ్యామ్ రోడ్లు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ మెట్రో రెండో దశను ముందుకు తీసుకెళ్తున్నామని, మెట్రో రెండో దశలో ఏడు కారిడార్లతో 122.9 కిలోమీటర్ల విస్తరణకు ప్రణాళిక రూపొందించామన్నారు. మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తున్నామని, ఆదిలాబాద్‌లో జాయింట్ యూజ్ ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు హైడ్రాను ఏర్పాటు చేశామని, బతుకమ్మకుంట, నల్లచెరువు సహా పలు చెరువుల పునరుద్ధరణ చేపట్టామని తెలిపారు. మూసీ పునరుజ్జీవనంలో 55 కిలోమీటర్ల పరిధిలో సమగ్ర ప్రణాళికను చేపట్టామని, 39 కొత్త ఎస్టీపీలు నిర్మిస్తున్నామని, గోదావరి నుంచి 2.5 టీఎంసీల స్వచ్ఛమైన నీటిని మూసీకి తరలించే ప్రణాళికను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.

ప్రజా పాలనలో జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు తెలంగాణపై నమ్మకం పెరిగిందని, బిజినెస్ రిఫారమ్స్ యాక్షన్ ప్లాన్‌లో బిజినెస్ ఎంట్రీ, కన్స్ట్రక్షన్ పర్మిట్ ఎనేబ్లర్స్, సర్వీస్ సెక్టార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో తెలంగాణ టాప్ అచీవర్‌గా నిలవడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్--2025 లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయని, ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశా లను ప్రపంచానికి చాటిచెబుతామన్నారు.

నెక్స్ ్ట-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ--2026తో తెలంగాణను ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో నిలబెట్టేలా దిశా నిర్దేశం చేసుకున్నామని చెప్పారు. సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్, అడ్వానస్డ్ మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో తెలంగాణకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నామని తెలిపారు. తెలంగాణను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లే బృహత్తర సంకల్పమే తెలంగాణ రైజింగ్--2047 అని, 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

హైదరాబాద్ కేంద్రంగా క్యూర్ - కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ప్యూర్ - పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, రీజనల్ రింగ్ రోడ్డు వెలుపల రేర్ - రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ... ఈ మూడు జోన్లతో రాష్ట్ర సమగ్ర వికాసానికి ప్రణాళిక రూపొందించామని తెలిపారు. రెండున్నరేండ్ల ప్రజా పాలనలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశామని, భవిష్యత్తు తెలంగాణ నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామన్నారు.

ఈ రెండున్నరేండ్లలో ప్రజా ప్రభుత్వం సాధించిన ప్రతి విజయంలో ప్రజల భాగస్వామ్యం ఉంది.. ఇక ముందు కూడా మీ అందరి సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుని తెలంగాణను దేశానికే  ఆదర్శంగా తీర్చి దిద్దుదామని పిలుపునిచ్చారు.