16 August, 2026 | 1:51 AM

అన్ని ఇంజిన్లు పరిగెత్తాలి

16-08-2026 12:33 AM
  1. రాష్ట్రాలు బలపడితేనే దేశం వేగంగా అభివృద్ధి
  2. ఒక్క ఇంజిన్‌తోనే కేసీఆర్ దూసుకెళ్లారు
  3. రెండేళ్లలో మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి
  4. మెట్రో విస్తరణకు కేంద్రం మోకాలడ్డింది  
  5. అన్నదమ్ముల కోసమే రేవంత్ 18 గంటల పని
  6. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి) : ‘దేశంలో 28 రాష్ట్రాలు, 28 ఇంజిన్లు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు బలంగా పని చేస్తేనే దేశం వేగంగా ముందుకు సాగుతుంది. ఒక్క డబుల్ ఇంజిన్‌తో అభివృద్ధి చెందదు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీజేపీ ప్రచారం చేస్తున్న ‘డబుల్ ఇంజిన్’ నినాదాన్ని తప్పుబట్టారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్న వాదన సరి కాదన్నారు.

తెలంగాణలో ఒక్క ఇంజిన్‌తో కేసీఆర్ ప్రభుత్వం అనేక రంగాల్లో మెరుపువేగంతో దూసుకెళ్లిందని, తెలంగాణ కంటే మెరుగ్గా పనిచేసిన ఒక్క డబుల్ ఇంజిన్ రాష్ట్రాన్నైనా చూపించాలని సవాల్ చేశారు. రాజకీయ విభేదాల కారణంగా రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరిం చేందుకు లక్డీకాపూల్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు మెట్రో విస్తరణకు అనుమతి కోరినా కేంద్రం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదే సమయంలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో చిన్న పట్టణాలకూ మెట్రో ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నారని విమర్శించారు. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అని చెప్పడం మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందేలా కేంద్రం వ్యవహరించాలని కోరారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.

దేశ ప్రజలకు వ్యక్తిగత, ప్రాంతీయ, భాషా, మత, కుల, రాష్ట్రపరమైన గుర్తింపులు ఎన్నున్నప్పటికీ అన్నింటి కంటే ముందుగా మనమంతా భారతీయులమని అన్నారు. భారతీయత అనే భావమే దేశ ప్రజలందరినీ ఒక్కటిగా నడిపిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహాత్మాగాంధీని గొప్పగా గౌరవిస్తుంటే, దేశంలో మాత్రం ఆయనను అవమానించేలా, ఆయనను హత్య చేసిన వారిని కీర్తించేలా కొందరు వ్యవహరించడం బాధాకరమని అన్నారు.

భారతదేశంలో సహజ వనరులకు కొదవ లేదని, దేశంలో దాదాపు 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉందని, అయినప్పటికీ దేశంలో ఇప్పటికీ సాగునీటి కోసం రైతులు, తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందాలని కేసీఆర్ ఆకాంక్షించారని గుర్తుచేశారు. స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడిచినా దేశంలోని నీటి వనరులను సమర్థంగా ఎలా వినియోగించుకోవాలన్న దానిపై స మగ్ర ప్రణాళిక లేకపోవడం విచారకరమన్నారు.

దేశంలో ఇప్పటికీ రోడ్లు, విద్యుత్, పాఠశాలలు లేని గ్రామాలు ఉండటం ఏమిటని ప్రశ్నించారు. 1980లలో ఆర్థిక వ్యవస్థ ల్లో భారత్ ముందున్నప్పటికీ, నేడు చైనా ఆర్థిక వ్యవస్థ 20 ట్రిలియన్డాలర్లకు పైగా ఉండగా, భారత్ సుమారు 3.4 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉందని తెలిపారు.

భారత్‌కు సహజ, మానవ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ దేశాన్ని ముందుకు నడిపించే స్పష్టమైన నాయకత్వం, దీర్ఘకాలిక ప్రణాళిక, చిత్తశుద్ధి లోపించాయని విమర్శించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి బలహీన దేశాలతో పోల్చుకుని మనం గొప్పగా ఉన్నామని చెప్పుకోవడం సరైన అభివృద్ధి  కాదన్నారు.  

యువత దేశంలోనే ఎదిగే అవకాశాలు కల్పించాలి

‘మన పిల్లలు చదవడానికి అమెరికా వెళ్లాల్సిన అవసరం ఎందుకు రావాలి? ఇక్కడే ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు ఎందుకు ఉండకూడదు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలోనే ప్రపంచస్థాయి విద్య, ఉపాధి, పరిశోధన, వ్యాపార అవకాశాలు కల్పించి ప్రతిభ బయటకు వెళ్లే పరిస్థితిని మార్చాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో నేటి కేంద్ర పాలకపక్షానికి పెద్దగా పాత్ర లేదని, అయినప్పటికీ నేడు ఇతరులకు దేశభక్తి గురించి పాఠాలు చెప్పే పరిస్థితి ఉందన్నారు.

భారతదేశంలో నీళ్లు, విద్యుత్, వ్యవసాయం, సంక్షేమం, మౌలిక వసతులు వంటి అంశాలపై సమగ్ర ప్రణాళిక అవసరమని కేసీఆర్‌ఎప్పటినుంచో చెబుతున్నారని, తెలంగాణలో సాధ్యమైన మోడల్ దేశవ్యాప్తంగా ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించా రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ త ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. 

‘కేసీఆర్‌ఉంటే 24 గంటల కరెంటు ఉండేది.. కేసీఆర్‌ఉంటే నీళ్లు అందే వి.. కేసీఆర్‌ఉంటే రైతుబంధు వచ్చేది’ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ముందు ఆలోచించి ఓటు వేయాల్సిన బాధ్యత ప్రజలదేనని, లేకపోతే ఐదేళ్లపాటు ఇబ్బందుల ను అనుభవించాల్సి వస్తుందన్నారు. 

కాంగ్రెస్ అవినీతిని వాళ్ల ఎమ్మెల్యేలే బయటపెడుతున్నారు..

కాంగ్రెస్ అవినీతి, అక్రమాలు ఏ స్థాయి లో ఉన్నాయో సొంత పార్టీ ఎమ్మెల్యేలే బయటపెడుతున్నారని కేటీఆర్ అన్నా రు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసి న వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ప్రభుత్వ పెద్దలపై అవినీతి ఆరోపణలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే తెలంగాణలో పాలన ఎంత దారుణంగా ఉందో తెలుస్తుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ, ఏఐసీసీ ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు.

తెలంగాణ ఏఐసీసీకి ఏటీఎంగా మారిందని దేశ ప్రధాని స్వయంగా చెబుతున్నారని పేర్కొన్నారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం వందలాది నిబంధనలు, షరతులు విధిస్తోందని విమర్శించారు.

కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. తమ హక్కులు, గౌరవం కోసం ధైర్యంగా నిలబడిన నల్సార్ విద్యార్థులకు సెల్యూట్ చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్యార్థుల గొంతుక, వారి హక్కులు, న్యాయం కోసం వారు చేసే పోరాటానికి తగిన గౌరవం ఉండాలన్నారు.  

అన్నదమ్ములకు దోచిపెట్టేందుకేనా?

సీఎం రేవంత్‌రెడ్డి 18 గంటలు పనిచేస్తున్నానని చెబుతున్నారని, అయితే ఆ సమయాన్నంతా సీఎం అన్నదమ్ములకు రాష్ట్రాన్ని దోచిపెట్టడానికే వాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కొండల్ రెడ్డికి కొండలు ఎలా కట్టబెట్టాలి, తిరుపతిరెడ్డికి ఎలా భూములు కట్టబెట్టాలనే ఆ లోచన తప్ప తెలంగాణ ప్రజల గురించి సీఎంకు పట్టింపు లేదని ఆరోపించారు. తన కుటుంబాన్ని, అన్నదమ్ములను అదానీ కుటుంబం కంటే పెద్దగా ఎలా చేయాలనే తపన తప్ప పరిపాలనపై సోయి లేదని మండిపడ్డారు.

గ్యారెంటీల మాట దేవుడెరుగు, ఉన్న కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా పథకాలను కూడా దెబ్బతీశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ సమన్వయంతో రైతుల పొలాల వద్దకే ఎరువులు చేరేలా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. నేడు రైతులు యూరియా కోసం క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని, అధికారుల కాళ్లు పట్టుకుని వేడుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం తమ పొలాలకు ఎరువుల కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. భారతదేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 2.7 నుంచి 2.8 శాతం మాత్రమేనని, కానీ దేశ జీడీపీలో తెలంగాణ వాటా సుమారు 5.2 శాతం ఉందని తెలిపారు. ‘మనం మన బరువుకంటే దాదా పు రెండింతలు మోస్తున్నాం’ అని పేర్కొన్నారు.

భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో తె లంగాణ కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాల్లో ఒకటని, కానీ దివాలా తీసిన రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణను ప్రపంచ స్థాయి లో ముందుకు తీసుకెళ్లగల నాయకత్వ సామర్థ్యం కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నా రు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని కోరారు.  తెలంగాణ భవన్‌కు 20 ఏళ్ల అంశంపై స్పందిస్తూ.. పార్టీకి కార్యాలయం అద్దెకు ఇవ్వడానికి కూడా కొందరు భయపడే పరిస్థితి అప్పట్లో ఉండేదని గుర్తుచేశారు.