16 August, 2026 | 2:28 AM

మోదీ యూత్ మంత్ర

16-08-2026 12:54 AM
  1. ఏఐ రంగంలో కోటి మంది యువతకు శిక్షణ 
  2. పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ 
  3.    2036 ఒలింపిక్స్‌కు టాలెంట్ హంట్ 
  4. 5-15 ఏళ్లలోపు క్రీడాకారుల అన్వేషణకు ప్రత్యేక కార్యాచరణ 
  5. యువతరం ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు 
  6. వికసిత్ భారత్-2047 సాధనే లక్ష్యం 
  7. లక్ష్య సాధనకు ‘సప్తధార’ రోడ్‌మ్యాప్ 
  8. మరిన్ని సెమీకండక్టర్లు, అణు రియాక్టర్ ప్లాంట్లు నెలకొల్పేందుకు కృషి 
  9. పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ స్పష్టీకరణ 
  10. ఎర్రకోటపై వరుసగా 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరణ

న్యూఢిల్లీ, ఆగస్టు ౧౫: కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో దేశవ్యాప్తంగా కోటి మంది యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించా రు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందిస్తామని వెల్లడించారు. యువతరం ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభు త్వం విధి విధానాలు అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. పంద్రాగస్టును పురస్కరించుకుని శనివారం ప్రధాని ముం దుగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళి అర్పించారు.

అనంతరం ఎర్రకోటకు చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. 203౬లో ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 5-15 ఏళ్లలోపు ప్రతిభావంతులైన క్రీడాకారుల అన్వేషణ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని, వారిని గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇస్తామని తెలి పారు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించి, యువతకు మెరుగైన భవిష్యత్తును అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.

ఖేలో ఇండి యా గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, బీచ్ గేమ్స్, వింటర్ గేమ్స్, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ న్యూట్రిషన్.. ఇలా ఏ రంగంలో నైనా భారత్ వేగంగా దూసుకుపోతున్నదని కొనియాడారు. ప్రస్తుతం దేశంలో జరు గుతున్న జనగణనలో యవత చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జనగణన అంటే గణాంకాల క్రోడీకరణ కాదని, ప్రజలు అందించే వివరాల ఆధారంగానే జాతీయ విధానాలు, పథకాలు రూపుదిద్దుకుంటాయని తెలిపారు. దేశ ప్రగతికి ఆ గణాంకాలే గీటురాయి అని తెలిపారు. అందుకే ప్రజలు కచ్చితమైన, స్పష్టమైన సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

సప్తధార రోడ్‌మ్యాప్..

‘వికసిత్ భారత్ -౨౦౪౭’ సాధనే ప్రస్తు తం తమ ముందున్న లక్ష్యమని ప్రధాని ఉద్ఘాటించారు. లక్ష్య సాధనకు కేంద్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా ‘సప్తధార’ రోడ్‌మ్యాప్‌ను అమలు చేయనున్నదని స్పష్టం చేశా రు. దేశ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా ఎదుగుతున్నదని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారినప్పుడు ప్ర పంచం మన వైపు చూసే తీరు మారుతుందని ఆకాంక్షించారు. ఇతర దేశాలపై ఆధార పడి ఎప్పటికీ జీవించలేమని, స్వయం సమృ ద్ధి సాధనే అందరి లక్ష్యం కావాలని అభిప్రాయపడ్డారు.

టెక్ ప్రపంచంలో చిప్‌ల విలు వను భారత్ అర్థం చేసుకుంటున్నదని, అం దుకే దేశంలో ఇప్పటివరకు మూడు సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. భవిష్యత్తులో మరిన్ని సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపా రు. బీజేపీ పాలనలో ౨5 కోట్లమంది పేదరికం నుంచి బయటపడ్డారని వివరించారు. తయారీ రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్ గా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ అమ లు చేస్తామని వివరించారు.

తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల ఉత్పత్తులను అం తర్జాతీయ మార్కెట్‌కు తరలించి, మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలపరుస్తామని వెల్లడించారు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, స్పేస్, రోబోటిక్స్ రంగాల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రక్షణ (డిఫెన్స్) రంగంలో స్వావలంబన సాధించి, డ్రోన్లు, హైపర్ సోనిక్ సాంకేతికతలో ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ఎగు మతిదారుగా ఎదగడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వివరించారు.

అణు ఇంధన సా మర్థ్యాన్ని విస్తరించి దేశ అవసరాలను తీరుస్తామని పేర్కొన్నారు. కొన్ని దేశాలు తమ వద్ద ఉన్న వనరులను తమ వద్దే పెట్టుకుని,  అంతర్జాతీయ ఇంధన రంగానికి కీడు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రపంచ దేశాల న్నింటికీ అందుబాటులో ఉండాల్సిన సము ద్ర మార్గాలను స్వార్థం కోసం వాడుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యు ద్ధాలు వస్తే ఇంధనం, ఎరువులు దొరకవని కొందరు భయపెట్టారని, ఎన్ని అడ్డంకులు సష్టించినా ప్రజలకు లోటు రానివ్వలేదని గుర్తుచేశారు.

‘ఆత్మనిర్భర్’ విధానాన్ని అనుసరించడం వల్లే దేశంలో ఎలాంటి ఇంధన కొరత తలెత్తకుండా నివారించగలిగామని స్పష్టం చేశారు. దేశంలో 1.75 కోట్ల ఇళ్లకు పైప్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇకపై వంద గిగావాట్ల అణు ఇంధనం ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. దేశంలో ఇటీవల హైడ్రోజన్ రైలును విజయంతంగా నడిపించామని, 90 ఏళ్లలో 30 శాతం మాత్రమే రైళ్ల ఎలక్ట్రిఫికేషన్ జరిగిందని తెలిపారు. ము న్ముందు దేశంలో ఐదు న్యూక్లియర్ రియాక్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

‘దిమాగీ నక్సల్స్’ ఉన్నారు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేసి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించామని, ఇ ప్పుడు దేశంలో సాయుధ నక్సల్ లేరని ప్రధాని తెలిపారు. కానీ.. ఇప్పుడు కొత్త రూ పంలో నక్సలిజం ముప్పు పొంచి ఉందని ప్రధాని పేర్కొన్నారు. యుద్ధంలో ఎంతమంది సైనికులు చనిపోయారో.. అడవు ల్లోని నక్సలిజంతో అంతమంది పోలీసులు చనిపోయారని విచారం వ్యక్తం చేశారు. నక్సలిజం భావజాలం ఉన్నవారిని కట్టడి చేయా ల్సి ఉందన్నారు.

మావోయిస్టు భావజాలాన్ని అనుసరిస్తూ, వ్యవస్థల లోపల ఎం తోమంది ముసుగులు వేసుకుని ‘దిమాగీ నక్సల్స్’ ఉన్నారని, ఆయా శక్తులు దేశ పురోగతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాలం చెల్లించిన సిద్ధాంతాలను సమాజం గుర్తించి, వాటిని సకాలంలో నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధిని వ్యతిరేకించే శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని పిలుపునిచ్చారు.

మహిళలకు సముచిత స్థానం..

చట్టసభల్లో మహిళలకు ౩౩శాతం ప్రాతినిధ్యం కల్పించేందుకే తమ ప్రభుత్వం మహిళా కోటా బిల్లును ప్రవేశపెట్టిందని ప్రధాని ఉద్ఘాటించారు. బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించుకోవాలన్నారు.

‘పాకెట్ స్కేర్’ వివాదాస్పదం

ప్రధాని మోదీ జేబుకు అలంకరించిన ‘పాకెట్ స్కేర్’ వివాదాస్ప దమైంది. ఆ పాకెట్ స్కేర్ రంగుల క్రమం జాతీయ జెండాలా లేదని, ఆ క్రమం ఐర్లాండ్ జాతీయ జెండాను పోలి ఉందని సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అం శంపై కాంగ్రెస్ శ్రేణులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ప్రధాని ఉర్దూ అక్షర క్రమంలో ‘తిరంగా’ ధరించారంటూ ఎద్దేవాచేస్తున్నాయి.

75 నిమిషాల పాటు ప్రధాని ప్రసంగం 

వేడుకలు ప్రారంభమైన సమయం లో భారత వాయుసేన ఎర్రకోటపై పూలవర్షం కురిపించింది. పంద్రాగస్టుకు మోదీ జాతీయ జెండాను ఎగుర వేయడం వరుసగా ఇది 13వ సారి. ఈసారి ప్రధాని ఏకధాటిగా 75 నిమిషాల పాటు ప్రసంగించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి పంద్రాగస్టు వేడుకల్లో (2014) మోదీ 65 నిమిషాల పాటు ప్రసంగించారు. అలాగే, 2015 లో 88 నిమిషాలు, 2016లో 96 నిమిషాలు, 2017లో 56 నిమిషాలు, 2018 లో 83 నిమిషాలు, 2019లో 92 నిమిషాలు, 2020లో 90 నిమిషాలు, 2021లో 88 నిమిషాలు, 2022లో 74 నిమిషాలు, 2023లో 90 నిమిషాలు, 2024లో 98 నిమిషాలు2025లో 103 నిమిషాల పాటు ప్రసంగించారు. 

వరుసగా రెండోసారి రాహుల్, ఖర్గే గైర్హాజరు 

ఎర్రకోటపై నిర్వహించిన పంద్రాగస్టు వేడుకలకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే గైర్హాజరయ్యారు. వీరిద్దరూ వరుసగా రెండోసారి కూడా గైర్హా జరు కావడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక వేడుకల్లో ప్రొటోకా ల్ అమలు సరిగా అమలు కాకపోవడం ఒక కారణమైతే, రాహుల్, ఖర్గే హోదా కు తగినట్లుగా సీట్ల కేటాయింపు లేకపోవడం కూడా గైర్హాజరుకు మరో కారణ మని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

బాంధనీ తలపాగా విశేషాలు.. 

పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ ధరించిన బాంధనీ తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తలపాగాకు జతగా తెల్లటి కుర్తా, చాక్లెట్ గోధుమ రంగు వెస్ట్‌కోట్ జాకెట్ ధరించారు. ఎరుపు రంగు తలపాగాపై ఉన్న పసుపు, తెలుపు చుక్కల డిజైన్ నేత్రపర్వంగా కనపిచింది. ఈ సంప్రదాయ తలపాగా శైలి వెనుక శతాబ్దాల చరిత్ర ఉంది. గుజరాత్ రాజవంశాలకు చెందిన వారు ఈ తరహా తలపాగా ధరిస్తారు. తలపాగాలోని చుక్కలు ప్రింటింగ్ ద్వారా ముద్రించినవి కాదు.

తయారీదారులు వస్త్రాన్ని రంగులో ముంచే ముందు దారంతో గట్టిగా కట్టడం వల్లే చుక్కలు ఏర్పడతాయి. ఈ రంగంలో ఎంతో నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులే ఇంత చక్కగా తలపాగా తయారు చేయగలరు. ‘బాంధనీ’ అనే పదం సంస్కృత మూలమైన ‘బాంధ్’ అనే పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం ముడి వేయడమని. గుజరాత్‌లో ఈ కళకు బాంధేజ్ అని పేరు. ఆ రాష్ట్రంలో ఖత్రీ సామాజిక వర్గం ఈ కళను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించింది.