16 August, 2026 | 1:33 AM

లక్షగళాలతో వందేమాతరం

16-08-2026 12:22 AM
  1. చెవుల్లో దూది పెట్టుకున్నా సరే.. భాగ్యలక్ష్మిఆలయం వద్ద ఆలపిస్తాం
  2. ఎంఐఎం నేతలారా దమ్ముంటే అడ్డుకోండి
  3. మోదీ బియ్యం అవసరం లేదని కేంద్రానికి లేఖ రాస్తారా?
  4. తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్‌ది
  5. కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): పాతబస్తీలో ని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద లక్షలాది మందితో వందేమాతరం గీతాలాపన చేయిస్తా, ఎంఐఎం నేతలారా దమ్ముం టే అడ్డుకోండని, చెవుల్లో దూది పెట్టుకున్నా వినిపించేలా చేస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. స్మార్ట్ రేషన్ కార్డుపై మోదీ ఫొటో ఎందుకు పెట్టరని, మరీ ప్రధాని మోదీ ఇస్తున్న బియ్యం అవసరం లేదని కేంద్రానికి లేఖ రాసే దమ్ము ఉందా? అంటూ కాంగ్రెస్‌ను విమర్శించారు.

జనాభా 3.5 కోట్లుంటే 3.43 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తారా? అని నిలదీశారు. 22ఏ నిషేధిత జాబితా పేరుతో రాష్ట్రంలో మహాదోపిడీ జరుగుతుందని ఆయన ఆరోపించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కోటి మంది యువతకు ఏఐ శిక్షణ ఇస్తామని ప్రధాని మోదీ ఎర్రకోటపై ప్రకటించడం హర్షణీయమన్నారు. పోటీ పరీక్షల కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందిస్తామని చెప్పడం అభినందనీయ మన్నారు.

రోజ్ గార్ మేళా పేరిట 12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత మోదీదే అన్నారు. గతంలో అసెంబ్లీలో వందేమాతర గీతాలాపనను ఎంఐఎం బహిష్కరించిందని, కాంగ్రెస్ కూడా వాళ్లకే వత్తాసు పలికిందని ఫైరయ్యారు. ఇకపై వందేమాతారాన్ని అవమానించే వాళ్లంతా దేశ్ర ద్రోహు లేనని పేర్కొన్నారు.

వందేమాతరం గీతాన్ని అవమానిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా తప్పదని, చట్ట ప్రకారం వ్యవహరించే తమను మతత త్వవాదులంటారా?, జెన్ జీలారా...ఆలోచించన చేయాలని కోరారు. స్మార్ట్ రేషన్ కార్డులపై సీఎం, మంత్రుల ఫొటోలు ఎందుకని ప్రశ్నిం చారు. తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్‌దన్నారు. కర్నాటకలో సిద్ధిరామయ్య హయాంలో వందల కోట్లతో తయారు చేసిన స్మార్ట్ కార్డులన్నీ నిరుపయోగమయ్యాయని, అక్కడ సిద్దిరామయ్యపోయి డీకే శివకుమార్ సీఎంగా వచ్చారన్నారు. 

రేషన్ బియ్యం ఇచ్చేది మోదీనే..

రేషన్ బియ్యం ఉచితంగా ఇచ్చేది మోదీ ప్రభుత్వమేనని, తెలంగాణలో 57 లక్షల కార్డుదారులకు దాదాపు 2 కోట్ల మందికి ఉచితంగా బియ్యం మోదీ ఇస్తున్నారన్నారు. మరి రేషన్‌కార్డులో మోదీ ఫొటో ఎందుకు పెట్టడం లేదన్నారు. అయితే కేంద్రం ఇచ్చే బియ్యం మీకు అవసరం లేదా?, సొమ్ము ఒకడిది... సోకు ఇంకొకరిదా?, మోదీ ఇస్తున్న బియ్యం అవసరం లేదని కేంద్రానికి లేఖ రాసే దమ్ముందా? అంటూ నిలదీశారు.

బీఆర్‌ఎస్ పాలనలోనూ ఇదే పరిస్థితి ఉండేదని, పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నిధులిస్తే... బీఆర్‌ఎస్ డ్రామాలాడిం దన్నారు. పీఎంఏవై ఇండ్లు ఇస్తే తామే ఇచ్చామని గప్పాలు కొడుతున్నారని, కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని ఎదురుదాడి చేస్తున్నారని ఫైరయ్యారు.

తెలంగాణ జనాభా 3.5 కోట్లుంటే... అందులో 3 కోట్ల 43 లక్షల మందికి ఉచితంగా బియ్యం ఇస్తారా?, తెలంగాణలో 30 లక్షల మంది ఇన్‌కం ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారని, వాళ్లకు కూడా బియ్యం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. 22ఏ నిషేధిత జాబితా పేరుతో మహాదోపిడీ కొనసాగుతోందని, ఏనుగులు మింగేటోడు పోయి పీనుగులు మింగేటోడు వచ్చాడంటూ విమర్శించారు. 

నిషేధిత జాబితాలో 95 లక్షల ఎకరాలు..

తెలంగాణలో మొత్తం 2 కోట్ల 77 లక్షల ఎకరాలుంటే ఏకంగా 95 లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెడతారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం అమ్మిన భూములను, హెచ్‌ఎండీఏ వేలం వేసిన భూములను, ప్రజలు కష్టపడి డబ్బులు చెల్లించి కొనుక్కున్న భూములను, పరిశ్రమలకు అమ్మిన భూములను కూడా 22ఏలో పెడతారా? అన్నారు. ఆ జాబితా నుంచి మా భూములను తొలగించాలం టూ చెప్పులరిగేలా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా రెండున్నరేళ్లుగా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.

ఫీజుల బకాయిలే ఇయ్యలేదు.. వచ్చే ఏడాది నుంచి అడ్వాన్స్‌గా జమ చేస్తామంటే నమ్మేదెలా అన్నారు. కోర్టు మొట్టికాయలు వేసినా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్వాన్స్‌గా రీయింబర్స్ మెంట్ పైసలు ఇస్తామంటే నమ్మేదెవరన్నారు. కేసీఆర్ 10 ఏళ్లలో 6 లక్షల కోట్ల అప్పు చేస్తే.. రేవంత్‌రెడ్డి రెండున్నరేళ్లలో 3 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు.

ఎన్నికల్లో హామీలిచ్చి మోసం చేయడం బీఆర్‌ఎస్‌కు అలవాటుగా మారితే... 6 గ్యారంటీలు, 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా మోసాలను కంటిన్యూ చేస్తోంద న్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఒక కుటుంబమే దోచుకుంటే.. కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంతోపాటు ఢిల్లీ పెద్దలకు కూడా దోచి పెడుతున్నారని ఆరోపించారు. హామీలిచ్చినప్పుడు డబ్బులు లేవని తెలియదా? డైవర్షన్ రాజకీయాలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని ప్రశ్నించారు. 

జెన్‌జీలు కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి..

21 ఏళ్లకే యువత చట్ట సభలకు వచ్చేలా తీర్మానం చేస్తామంటే కాదనే వారెవరని ఆయన నిలదీశారు. కాంగ్రెస్‌కు చిత్త శుద్ధి ఉంటే జెన్ జీకి మంత్రి పదవులు, ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.