30-12-2025 12:35:43 PM
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని(Uttarakhand) అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం ద్వారహాట్ నుంచి రామ్‌నగర్‌కు వెళ్తున్న ఒక ప్రయాణీకుల బస్సు లోతైన లోయలో పడిపోవడంతో ఏడుగురు మరణించారు. ఈ ఘోర ప్రమాదంలో మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు. 19 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు భికియైన్‌సైన్ ప్రాంతంలోని సలాపాని సమీపంలో అదుపు తప్పింది. వాహనం వినాయక్ దాటిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం ప్రమాద స్థలానికి హుటాహుటిన చేరుకుని గాయపడిన ప్రయాణికులను భిఖియాసైన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపింది. "సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలను ఘటనా స్థలానికి పంపించాము. ఈ ఘటనలో కొందరు మరణించినట్లు సమాచారం అందింది," అని అల్మోరా ఎస్ఎస్‌పి దేవేంద్ర పించా(Almora SSP Devendra Pincha) తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తాను జిల్లా యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నానని, గాయపడిన వారికి అవసరమైన సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి ధామి(Chief Minister Pushkar Singh Dhami) తెలిపారు.
''అల్మోరా జిల్లాలోని బిఖియాసైన్ నుండి రామ్‌నగర్‌కు వెళ్తున్న ఒక బస్సు బిఖియాసైన్-వినాయక్ మోటార్ రోడ్డుపై ప్రమాదానికి గురైందని, ఈ ఘటనలో ప్రయాణికులకు ప్రాణనష్టం జరిగిందని అత్యంత బాధాకరమైన వార్త అందింది. ఈ సంఘటన తీవ్రంగా బాధాకరం, హృదయ విదారకం. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను జిల్లా యంత్రాంగం వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తోంది. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించారు. నేను స్థానిక పరిపాలనా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను.'' అని ముఖ్యమంత్రి ధామి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రి, అల్మోరా-పిథోరాగఢ్ ఎంపీ అజయ్ తమ్తా కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పోలీసులు, సహాయక బృందాలు సమగ్ర సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చామని ఆయన పేర్కొన్నారు.