30-12-2025 10:59:16 AM
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మంగళవారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పొరుగు దేశాభివృద్ధికి, అలాగే భారత్-బంగ్లాదేశ్ సంబంధాల బలోపేతానికి ఆమె చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ అభివృద్ధిలో ఖలీదా జియా కీలక పాత్ర పోషించారని మోదీ కొనియాడారు.
ఢాకాలో మాజీ ప్రధాని, బీఎన్‌పీ అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా(Khaleda Zia) మరణవార్త విని తీవ్రంగా విచారించాను. ఆమె కుటుంబానికి, బంగ్లాదేశ్ ప్రజలందరికీ మా ప్రగాఢ సానుభూతి. ఈ విషాద నష్టాన్ని భరించే మనోధైర్యాన్ని సర్వశక్తిమంతుడు ఆమె కుటుంబానికి ప్రసాదించుగాక. 2015లో ఢాకాలో ఆమెతో జరిగిన నా ఆత్మీయ భేటీని నేను గుర్తు చేసుకుంటున్నాను. ఆమె దార్శనికత, వారసత్వం మా భాగస్వామ్యానికి మార్గదర్శకంగా కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాము. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము." " అని మోదీ ఎక్స్‌లో రాశారు.
బంగ్లాదేశ్ మాజీ తొలి మహిళా ప్రధానమంత్రి(Bangladesh former first female Prime Minister) ఖలీదా జియా సుదీర్ఘ అనారోగ్యంతో మరణించారని స్థానిక మీడియా మంగళవారం నివేదించింది. దేశ తొలి మహిళా ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అధ్యక్షురాలైన జియా 80 ఏళ్ల వయసులో కన్నుమూశారని ఢాకా ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది. ఖలీదా జియా మంగళవారం తెల్లవారుజామున ఢాకాలోని ఎవర్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆమె వ్యక్తిగత వైద్యుడు ప్రొఫెసర్ జాహిద్ హుస్సేన్ ధృవీకరించారు.