1 April, 2026 | 2:33 AM

మహిళా సంఘాలకు బస్సుల నిర్వహణ బాధ్యతలు

01-04-2026 12:53 AM

కలెక్టర్ రాజర్షి షా వెల్లడి

ఆదిలాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడమే కాకుండా, స్వయంగా ‘ఈ- ల’ నిర్వహణను జిల్లా సమాఖ్యకు కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకముగా చేపట్టిన ‘మహాలక్ష్మి’ పథకం మహిళల ఆర్థికాభివృద్ధికి, సాధికారతకు పెద్దపీట వేస్తోందన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అనంతరం మహిళ, ట్రాన్స్ జెండర్ ప్రయాణికులను, ఉద్యోగులను కలెక్టర్ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఆదిలాబాద్ జిల్లాలో ఈ పథకం కింద సుమారు రూ. 2.55 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నరని, ఛార్జీల రూపంలో ఆదిలాబాద్ డిపో 106 కోట్లు, ఉట్నూరు డిపో 28 కోట్ల రూపాయలకు పైగా ఆదా చేసుకున్నారని తెలిపారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, త్వరలోనే ప్రతి ఎస్.హెచ్.జి మహిళకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తామని ప్రకటించారు.

క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని, పి.హెచ్.సి కేంద్రాల ద్వారా ఈ పైలట్ ప్రాజెక్టును మొదలుపెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, మెప్మా పిడి రాజు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎంలు శ్రీహర్ష, రామయ్య, డిఏం ప్రతిమ, పట్టణ తహసిల్దార్ శ్రీనివాస్, ఆర్టీసీ, ఇతర శాఖల మహిళ ఉద్యోగులు, మహిళా ప్రయాణికులు, ట్రాన్స్ జెండర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అలాగే అహింస, సత్య మార్గంలో పయనించడమే భగవాన్ మహావీర్  కు అర్పించే అసలైన నివాళి అని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. స్థానిక రాణి సతిజీ కాలనీలోని మహావీర్‌భవన్లో మంగళవారం భగవాన్ మహావీర్ స్వామి జన్మ కళ్యాణక్ మహోత్సవం (మహావీర్ జయంతి) వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై జైన్ సమాజం ప్రతినిధులతో కలిసి మహావీర్ చిత్ర పటానికి పూజాలు నిర్వహించారు.