01-08-2025 11:37:48 PM
ఆర్థిక ఇబ్బందులు, తండ్రి మృతి వేదన తాళలేక జీవితానికి స్వస్తి చెప్పిన చంద్రేష్..
శేరిలింగంపల్లి: ఆర్థికంగా దెబ్బతిన్నాడు… కుటుంబంలో తండ్రి మృతితో మానసికంగా కుంగిపోయాడు… పైపై సాథించడానికేమీ కనిపించని జీవితం చివరకు ఓ చెరువులో ముగిసింది. మాదాపూర్ దుర్గం చెరువు(Madhapur Durgam Cheruvu)లో ఓ యువ వ్యాపారవేత్త దూకి బలవన్మరణం చేసుకున్న సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన చంద్రేష్ జైన్(34) హార్డువేర్ సామాగ్రి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా వ్యాపారం కుదర్లేదు. భారీగా నష్టాలు రావడంతో అప్పులు పెరిగిపోయాయి, ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరుకున్న ఆయన, కొద్ది రోజుల క్రితం తండ్రిని కోల్పోవడం వల్ల మానసికంగా పూర్తిగా కుంగిపోయాడు. ఆత్మవిశ్వాసం కోల్పోయిన చంద్రేష్ గురువారం ఉదయం మాదాపూర్‌లోని దుర్గం చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. చంద్రేష్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా సమాచారం దొరకలేదు.
వెంటనే అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం దుర్గం చెరువులో ఓ మృతదేహం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మాదాపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబ సభ్యులు వచ్చి మృతుడిని చంద్రేష్ జైన్‌గా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ విషాద ఘటన వ్యాపార వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ‘‘ఇలాంటి ఆర్థిక, కుటుంబ సమస్యల మధ్య చిక్కుకుని యువకులు జీవితంపై ఆశ కోల్పోవడం బాధాకరం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని ముందే గుర్తించి, మానసికంగా అండగా నిలవాల్సిన బాధ్యత సమాజం అంతటిదే’’ అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.