10 August, 2026 | 3:27 AM

రామప్పలో భక్తుల సందడి

10-08-2026 02:10 AM

వెంకటాపూర్, ఆగస్టు 9 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఉదయం నుంచే ఆలయ పరిసరాలు భక్తుల సందడితో కళకళలాడాయి. రామప్పకు చేరుకున్న భక్తులు శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తుల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

స్వామివారి దర్శనం అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలోని అద్భుత శిల్పాలను ఆసక్తిగా తిలకించారు. ఆలయ గోపురం, స్తంభాలు, శిల్పాలు, మండపంలోని రాతి కళాఖండాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా టూరిజం గైడ్లు భక్తులకు రామప్ప ఆలయ చరిత్ర, కాకతీయుల కాలం నాటి నిర్మాణ విశిష్టత, శిల్పకళా నైపుణ్యం గురించి వివరించారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఆలయ పరిసరాలు, రామప్ప చెరువు అందాలను ఆస్వాదించారు. సెలవు రోజు కావడంతో రామప్పలో భక్తులు, పర్యాటకుల రద్దీ కనిపించింది.