3 July, 2026 | 2:24 AM

మూసీ ప్రాజెక్టు మొదటి దశకు.. క్యాబినెట్ రైట్ రైట్

03-07-2026 01:41 AM

రూ.7,345 కోట్ల విలువైన పనుల మంజూరుకు ఆమోదం 

  1. వీబీ జీ రామ్ జీ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధ్దం 
  2. సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని నిర్ణయం 
  3. వీబీ జీ రామ్ జీ చట్టంపై మంత్రి ఉత్తమ్‌కుమారెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ 
  4. ప్రభుత్వ టీచర్లు, లెక్చరర్లు, సిబ్బందికి బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం 
  5. నవోదయ, కేవీ స్కూల్స్, గోదాములకు భూముల కేటాయింపు 
  6. మూడు టిమ్స్, వరంగల్ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల్లో.. 6,278 పోస్టుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదం
  7. మూడు గంటలపాటు రాష్ట్ర మంత్రిమండలి భేటీ

*******************

తీర్మానాలు..

* వరంగల్ జిల్లా నెక్కొండ మండ లం బొల్లికుంట గ్రామంలో నిత్యావసర వస్తువులు గోదాముల నిర్మాణానికి 50 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కా లపహాడ్ గ్రామంలో 10 ఎకరాలు రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు మార్కెట్ రేట్ ప్రకారం కేటాయింపు. 

* జవహర్ నవోదయ విద్యాలయాలకు రెండు చోట్ల ప్రభుత్వం స్థలం కేటాయించింది. మహబూబ్‌నగర్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19.12 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. జగిత్యాల జిల్లా చల్‌గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు.

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌లో భాగంగా మొదటిదశ పనులకు రాష్ట్ర మంత్రివర్గం గురువారం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.  తొలి దశలో 21 కిలోమీటర్ల పొడవున అభివృద్ధికి రూ. 7,345.12 కోట్ల విలువైన పనుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. హిమాయత్‌సాగర్ నుంచి ఈసా.. ఉస్మాన్ సాగర్ నుంచి మూసా ప్రవాహాలు ప్రారంభమయ్యే చోటు నుంచి బాఫూఘాట్ వరకు మొదటిదశ పనులు చేపడతారు.

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ పను లు.. నిర్వహణ కోసం నూతనంగా 147 పోస్టులు కల్పించడంతో పాటు ఇతర శాఖ ల నుంచి అవసరమైన సిబ్బంది డిప్యూటేషన్ మీద పంపాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ యించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమవేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు.

సచివాలయంలో దాదాపు మూడు గంట ల పాటు జరిగిన డిజిటల్ క్యాబినెట్‌లో రాష్ట్రంలోని వీబీజీ రామ్‌జీ పథకం అమలు, విద్యా, వైద్యం, సంక్షేమం, మూసీ రివ ర్ ఫ్రంట్‌తో పాటు గోదాముల నిర్మాణం, నవోదయ పాఠశాల నిర్మాణాలకు భూమి కేటాయింపు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది. క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, ప్రభుత్వ విప్ శంకర్‌నాయక్‌తో కలి సి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియా తో మాట్లాడారు.

యూపీఏ హయాంలో అప్ప టి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం పేదలు, కార్మికుల భద్రత కోసం, పేదవాళ్లకు నచ్చేవిధంగా ఉపాధి హామీ చట్టం తీసుకొస్తే.. మోదీ ప్రభుత్వం పేదవాడి నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒంటెద్దు పోకడలతో వీబీజీ రామ్‌జీ పథకాన్ని తీసుకొచ్చిందని మం త్రి పొంగులేటి మండిపడ్డారు. ఉపాధి హామీ చట్టాన్ని మార్చవద్దని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

అయినా కేంద్రం అనుకున్నది చేయాలని నిర్ణయం తీసుకోవడంతో.. చట్టంలోని లోపాలపై ప్రజలు, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించి నివేదిక ఇవ్వడానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో సబ్ కమిటీ వేసినట్లు ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలన్నీ కొత్త చట్టానికి ఆమోదం తెలిపాయా.. లేదా అని అధికారులను క్యాబినెట్ అడిగి తెలుసుకుందని చెప్పారు.

అన్ని రాష్ట్రాలు కొత్త చట్టం అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించడంతో.. గత్యంతరం లేని పరిస్థితిలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించే ఆలోచనతో.. ఈ కొత్త  చట్టాన్ని 2026 జులై 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి తెచ్చేందుకు నోటిఫికేషన్ జారీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అయితే న్యాయపరంగా పోరాటం చేయాలని, కొత్త చట్టంలో విధించిన నిబంధనలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు పొంగులేటి చెప్పారు. పార్లమెంట్‌లోనూ కేంద్రం తీరును నిలదీయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 

టీచర్లకు కూడా..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అందించే అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర సిబ్బందికి కూడా అందించాలని  రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించే సంకల్పంతో పాటు జవాబుదారీతనం పెంచే ఆలోచనలో భాగంగా రాష్ట్రం లో దాదాపు లక్షన్నర మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి ఈ పథకం వర్తింపజేయనున్నట్లు మంత్రి తెలిపారు.

వైద్యరంగంలో పోస్టులు..

పేదవాడికి నిమ్స్ తరహాలో టిమ్స్ ఆసుపత్రుల్లో వైద్యం అందుబాటులోకి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించా రు. సనత్‌నగర్, ఎల్‌బీ నగర్, అల్వాల్ టిమ్స్‌తో పాటు వరంగల్ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్లు, వైద్యసిబ్బంది పోస్టులు మంజూరు చేసింది.

మొత్తం 6,278 పోస్టుల్లో  1,494 రెగ్యులర్, 549 కాంట్రాక్ట్ బేసిక్, 4,235 ఔట్‌సోర్సింగ్ పోస్టులకు అనుమతించారు. ఈ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక్కడ అందించే వైద్య సేవలకు సీఎం రిలిఫ్ ఫండ్ నుంచి ఎన్‌ఓసీలు  కూడా ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.