3 July, 2026 | 2:47 AM

ఉన్నత విద్యతోనే ఉజ్వల భవిష్యత్

03-07-2026 01:42 AM

ఐటీడీఏ పీఓ మంద మకరంద్

కుమ్రం భీం ఆసిఫాబాద్, జులై2( విజయ క్రాంతి):చదువును మధ్యలో ఆపవద్దని ఉన్నత విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఐటీడీఏ పీవో మంద మకరంద్ అన్నారు.ఆసిఫాబాద్లోని టిడబ్ల్యూ మోడల్ స్పోరట్స్ స్కూల్ను ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి గురువారం సందర్శించి పదో తరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత విద్య, కెరీర్ ప్రణాళిక, లక్ష్య సాధన, పోటీ పరీక్షలు, భవిష్యత్తులో అందుబాటులో ఉన్న అవకాశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు.

పదో తరగతి పూర్తయ్యాక ఎట్టి పరిస్థితుల్లోనూ చదువును మధ్యలో ఆపవద్దని, ఇంటర్మీడియట్ అనంతరం ఉన్నత విద్య, సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి కోర్సులు, ప్రభుత్వ ఉద్యోగాలు, పోటీ పరీక్షలు వంటి అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి విద్యార్థి స్పష్టమైన లక్ష్యంతో కృషి చేస్తూ విద్య ద్వారానే భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు.విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాల పెంపు కోసం వోకాబ్యులరీ ఆధారిత పదాల ఆటలు నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని నింపారు.

అనంతరం ఆసిఫాబా ద్లోని యువజన శిక్షణ కేంద్రం (వైటీసీ)ను సందర్శించిన మంద మకరంద్, శిక్షణా కార్యక్రమాల పురోగతిని పరిశీలించి యువత ప్రభుత్వం కల్పిస్తున్న నైపుణ్యాభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, వైటీసీ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.