21న క్యాబినెట్ భేటీ!
- రుణమాఫీతో పాటు కీలక అంశాలపై నిర్ణయం
- ఆరు గ్యారెంటీల అమలుపై చర్చకు అవకాశం
- పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలపై సమాలోచనలు
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 21న జరుగనుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలోని ఆరో అంతస్తులో మంత్రివర్గ సమావేశం జరుగుతుం దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్య క్షతన జరుగనున్న ఈ సమావేశంలో రైతు రుణమాఫీతో పాటు కీలక అంశాలకు సంబంధించి మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేస్తామని లోక్‌సభ ఎన్నికల ప్రచా రంలో సీఎంతోపాటు నేతలందరూ ప్రకటించారు. అనుకున్నట్టుగానే రైతు రుణమాఫీకి సంబంధించి ఈ క్యాబినెట్ సమావేశంలో లోతుగా చర్చించనున్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం నిబంధనలను పాటిస్తే ఎలా ఉంటుందనే విషయంపై మంత్రివర్గం నిర్ణ యం తీసుకోనుంది. పైగా రుణమాఫీకి కట్ ఆఫ్ డేట్‌గా ఎప్పటి నుంచి తీసుకోవాలనేది కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనితోపాటు ఏయే నిబం ధనల ప్రకారం ఎంత మంది రైతులు రుణమాఫీ పరిధిలోకి వస్తారు? ఎంత మొత్తం అవసరముంటుందనే అంశంపైనా లోతుగా చర్చిస్తారు.
రుణమాఫీకి కావాల్సిన ఆర్థిక వనరుల సేకరణ ఎలా చేయాలి? ఎక్కడి నుంచి వనరులను సేకరించవచ్చనే అంశంపైనా చర్చించి నిర్ణయం తీసుకునే అవకా శముంది. దీనితోపాటు ఈ వానకాలం పంట కోసం రైతు భరోసాపైనా చర్చించనున్నారు. నిజమైన రైతులతోపాటు బడా వ్యాపారులు, యాభై, వంద ఎకరాల భూములు ఉన్నవారికీ రైతు భరోసా ఇవ్వకుండా ఎంత వరకు పరిమితి విధించవ్చనే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. పైగా ఈ విషయంలోనూ కేంద్రం అమలు చేస్తున్న అర్హత నిబంధనలను పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రైతు భరోసా విడుదల చేయాల్సిన తేదీలపైనా క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
బడ్జెట్ సమావేశాలు..
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇందుకు శాసనసభ సమావేశాలనుకూడా నిర్వహించాలి. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు మనకు జూలై ఆఖరు వరకు గడువు ఉంది. అయితే కేంద్రం ముందుగా పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే అందులో మన రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేక కేటాయింపులు ఉంటాయా అనేది పరిశీలించి రాష్ట్ర పద్దులో వాటిని పొందుపర్చే అవకాశం ఉంటుంది. అయితే కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ను జూలై 22 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహించే వర్షాకాలం సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. కానీ అప్పటివరకు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయడం సాంకేతికంగా కుదరదు. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ సమావేశాలు జూలై రెండో, లేదా మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉంటుందని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లకు జరుగుతున్న మరమ్మతులపైనా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.
ఆరు గ్యారెంటీలపైనా..
జూలై మూడోవారంలో బడ్జెట్ సమావేశాలు, వివిధ శాఖలకు కేటాయింపులు ఉండనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపైనా క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే వంట గ్యాస్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును, రూ.10 లక్షల ఆరోగ్య బీమా తదితరాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. పెంచిన ఫించన్లు, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, పెంచిన రైతు భరోసా, కౌలు రైతులకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, సొంత స్థలం ఉన్నవారికి రూ.5 లక్షలు, స్థలం లేనివారికి జాగాతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు వంటివి అమలు చేయాల్సి ఉంది.
రాష్ట్ర చిహ్నంపైనా..
రాష్ట్ర కొత్త చిహ్నంపై క్యాబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే అనేక నమూనాలు వచ్చాయి. సీఎం స్వయంగా పలు నమూనాలను పరిశీలించారు. రూపశిల్పితోనూ సమా వేశ మై చర్చించారు. కొత్త చిహ్నంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ లాంటి చిహ్నాలు రాజరికానికి ప్రతీకలని, వాటిని తీసివేసే అవకాశం ఉన్నట్టుగా రాష్ట్రంలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గం ఈ చిహ్నంపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయంలోనే ప్రతిష్ఠిస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గతంలో ఉన్న తెలంగాణ తల్లి ముఖకవలికలను మార్చి రాష్ట్ర సంస్కృతీ సంప్ర దాయాలు ఉట్టిపడేలా రూపొందించే పనిలో శిల్పులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన నామూనాలను మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.






