calender_icon.png 7 October, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూముల కేటాయింపు లెక్కలు తీయండి

07-10-2025 12:51:49 AM

-అటవీ శాఖకు రెవెన్యూ శాఖ, రెవెన్యూ శాఖకు అటవీ శాఖ కేటాయించిన భూమి ఎంత? తేల్చండి

-అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): గత 40 ఏండ్ల నుంచి రెవెన్యూ శాఖ తరఫున వివిధ అవసరాల కోసం ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూముల వివరాలు, వినియోగం, ప్రస్తుతం వాటి పరిస్థితి తదితర అంశాలపై సమగ్ర నివేదికను రూపొందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు.

వివిధ ప్రాజెక్ట్‌ల కోసం రెవెన్యూ విభాగం వేల ఎకరాల భూములను పలు విభాగాలకు ముఖ్యంగా ఇరిగేషన్, ఫారెస్ట్ శాఖలకు కేటాయించిందని, అయితే రాష్ర్ట విభజన తర్వాత ప్రాజెక్ట్‌లలో మార్పులు చేర్పులు జరగడంతోపాటు కొన్ని రద్దు కూడా అయ్యాయని తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని లెక్కలు తేల్చాలని సూచించారు. గత 30 ఏండ్లలో అటవీ శాఖకు రెవెన్యూ శాఖ కేటాయించిన భూమి ఎంత? అటవీ శాఖ రెవెన్యూ శాఖకు కేటాయించిన భూమి ఎంత? అనే వివరాలను రెండు శాఖలు సమన్వయంతో ఒక నివేదికను తయారుచేయాలని చెప్పారు.

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,138 ఎకరాల అటవీ భూమి కేటాయించేందుకు ప్రతిపాదించారని, ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. కేశవపురం తాగునీటి పథకం కోసం రెవెన్యూ శాఖ గతంలో అటవీశాఖకు 1,030 ఎకరాల భూమిని కేటాయించిందని, అయితే ఈ ప్రాజెక్ట్ రద్దయినందున సదరు భూమిని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్‌కు బదలాయింపునకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి, అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పీసీసీఎఫ్, మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ తదితరులు పాల్గొన్నారు.