కోర్టు ఉత్తర్వులున్నా పట్టాదారు పేరు మార్పా?
రూ.5 లక్షల జరిమానా చెల్లించండి
ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాం తి): రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలో రెండెకరాల స్థలానికి సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులున్నప్పటికీ రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై పట్టాదారు పేరు మార్చడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రెవెన్యూ అధికారుల సాయంతో నార్సింగిలోని సర్వే నంబర్ 340/4/1లో పట్టాదారుగా ఉన్న ఏసియన్ ట్యూబ్స్ ప్రైవే ట్ లిమిటెడ్ పేరును తొలగించి ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును నమోదు చేసి పాసుబుక్ జారీ చేయడం చెల్లదని పేర్కొంది.
రెవెన్యూ అధికారుల సాయంతో ధరణి పోర్టల్లో పేరు మార్చుకోవడంతోపాటు కోర్టుకు వాస్తవా లు వెల్లడించని ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధి పజ్జూరి కరుణాకర్‌పై మండి పడింది. వాస్తవాలను తొక్కిపెట్టడం చట్టప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని, రూ.5 లక్షల జరిమానా చెల్లించాలంటూ ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది. 1998లో కొనుగోలు చేసిన నార్సింగిలోని సర్వే నంబర్ 340/4/1లోని 2 ఎకరాల భూమి పట్టాదారుగా తమ పేరు ను తొలగించి ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ పేరుతో గండిపేట తహసిల్దార్ పాస్ బుక్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఏసియన్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున శత్రుగన్ అగర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బీ నళిన్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఈ భూమికి సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలంటూ 2014లో ఇదే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ తమకెలాంటి నోటీసు ఇవ్వకుండా పిటిషనర్ పేరును తొలగించి ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేష న్ పేరును పట్టాదారుగా చేర్చుతూ తహసిల్దార్ గత ఏడాది అక్టోబరు 13న ఉత్తర్వులు జారీచేశారన్నారు.
ప్రతివాది అయిన ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ కౌంటరు దాఖ లు చేస్తూ హైకోర్టులో వివాదం ఉన్న పిటిషన్‌లో మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని అన్నారు. అందువల్ల మ్యుటేషన్ చేయించుకున్నామని, పిటిషనర్‌కు నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను, రికార్డుల ను పరిశీలించిన న్యాయమూర్తి ఏషియన్ ట్యూబ్స్ పేరుతో ఉన్న మ్యుటేషన్‌ను రద్దు చేస్తూ అదనపు కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ తొక్కిపెట్టడాన్ని తప్పుబట్టారు.
ఏషియన్ ట్యూబ్స్‌కు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా మ్యుటేషన్ చేశారన్నారు. మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా తీసుకున్న చర్యలన్నీ చట్టవిరుద్ధమని స్పష్టంచేశారు. ఇలాంటి చర్యలన్నీ రెవెన్యూ అధికారుల సహకారం లేకుండా జరిగాయని చెప్పలేమని, ఇవి కోర్టు అధికారాన్ని తక్కువచేయడమేగాకుండా కోర్టును మోసం చేసిన దానితో సమానమేనని అన్నారు. 2014 నాటి కోర్టు ఉత్తర్వుల ప్రకారం పిటిషనర్ పేరును పునరుద్ధరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
బాధ్యులైన అధికారులపై చర్య లు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు. రూ.5 లక్షల జరి మానాను హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి చెల్లించాలంటూ ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్‌ను ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.
విగ్రహం ఏర్పాటును నిలిపివేయండి
హైకోర్టులో పిల్
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణ తల్లి విగ్రహాల మార్పును సవాలు చేస్తూ హైకోర్టులో హైదరాబాద్‌కు చెందిన రచయిత జూలు రు గౌరీశంకర్ పిల్ దాఖలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపు రేఖలు మార్చుతూ రాష్ట్రవ్యాప్తంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.150 కోట్ల భారం పడుతోం దన్నారు. ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చకుండా ఆదేశాలు జారీచే యాలని కోరారు.
తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలున్నాయని అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిందన్న కారణంగా రూపురేఖలు మార్చడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఆమెను ప్రస న్నం చేసుకోవాలన్న ఉద్దేశంతో డిసెంబరు 9న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. కాంగ్రెస్ దీన్ని రాజకీయం చేస్తోందని, కక్షసాధిం పు రాజకీయాల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడం సరికాదన్నారు.
ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం హైకో ర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన కాంట్రాక్టును సవాలు చేస్తూ దాఖలైన మరో పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది.




