ఓబీసీలకు మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని కోరిన జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): దేశంలో ఓబీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కేంద్రం హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. శనివారం ఢిల్లీలో జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం బండి సంజయ్‌కి వినతిపత్రం అందజేసింది. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారానే బీసీల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
దేశంలో అనేక సామాజికవర్గాల సంక్షేమానికి 72 మంత్రిత్వశాఖలు ఉన్నాయని, కానీ మెజార్టీగా ఉన్న బీసీలకు నేటి వరకు ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో బీసీ మంత్రిత్వ శాఖలున్నప్పటికీ కేంద్రంలో లేకపోవడంతో కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందని గుర్తుచేశారు. జనవరి 2025లో జరిగే జనగణనలో బీసీ కులగణన చేయాలని కోరారు.
కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని కేంద్రమంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చినట్టు జాజుల పేర్కొన్నారు. కేంద్ర మంత్రిని కలిసినవారిలో సంఘం ఏపీ అ ధ్యక్షుడు కేసన శంకర్‌రావు, నాయకులు కుం దారం గణేశ్‌చారి, కుల్కచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రమ్, నాగమల్లేశ్వరావు, నరసింహా నాయక్, జాజుల లింగం, ఈడిగ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు.




