calender_icon.png 14 August, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూపర్ లగ్జరీ బస్సు రద్దుతో తప్పని ఇబ్బందులు

14-08-2025 12:36:03 PM

3 మస్టర్ల సాకుతో అధికారుల నిర్ణయం

ఆర్టీసీ సంస్థకు రోజు రూ 50 వేల నష్టం

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల నుండి రాత్రి 10 గంటలకు బెల్లంపల్లి కి నడిచే ఆర్టీసీ సూపర్ లగ్జరీ(Super Luxury Bus) బస్సులు అధికారులు రద్దు చేయడం వల్ల మంచిర్యాల నుండి బెల్లంపల్లికి రాత్రి సమయంలో వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల డిపో నుండి రాత్రి 10 గంటలకు బయలుదేరి 10.40 గంటలకు ఈ బస్సు బెల్లంపల్లికి చేరుకునేదని, సరిగ్గా రాత్రి 11 గంటలకు బెల్లంపల్లి బస్టాండ్ నుండి హైదరాబాద్ కు వెళ్లేదని ప్రయాణికులు చెబుతున్నారు. రాత్రి 10 దాటితే మంచిర్యాల నుండి బెల్లంపల్లి రూట్ లో నడిచే బస్సులు లేకుండా పోవడంతో నిత్యం ఇబ్బంది పడాల్సి వస్తుందని ప్రయాణికులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ రూట్లో నడిచే సూపర్ లగ్జరీ బస్సు ఎంతో అనుకూలంగా ఉండేదంటున్నారు. బెల్లంపల్లి నుండి రాత్రి 11 గంటలకు హైదరాబాద్ ట్రిప్పులో ఒక్క బెల్లంపల్లి నుండే రూ 25 వేలకు పైగా కలెక్షన్ తెచ్చేదని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. మొత్తంగా రూ 50 వేల వరకు ఈ బస్సు ద్వారా సంస్థకు కలెక్షన్ వచ్చేదని చెబుతున్నారు. అయితే ఈ ట్రిప్పులో డ్యూటీ డ్రైవర్, కండక్టర్ కు సంస్థ నుండి 3 మాస్టర్లు చెల్లించాల్సి రావడంతో అధికారులు ఈ బస్సును అనాలోచితంగా రద్దు చేసినట్లు తెలిసింది. ఆర్టీసీ సంస్థకు నిత్యం లాభాలు తెచ్చిపెట్టే సూపర్ లగ్జరీ సర్వీసులు రద్దు చేయడం వల్ల సంస్థ కు నష్టం చేకూరుతుండగా ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. సూపర్ లగ్జరీ బస్సును నడిపించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు సైతం మొరపెట్టుకున్నామని ప్రయాణికులు చెబుతున్నారు.సిబ్బందికి 3 మస్టర్లు వేసే సాకుతో రద్దు చేసిన ఈ సర్వీసును మళ్లీ తిరిగి పునరుద్ధరించాలని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది కోరుతున్నారు.