7 April, 2026 | 6:00 PM

రసాయనాల నియంత్రణతో క్యాన్సర్ నివారణ

07-04-2026 04:33 PM

- సర్పంచ్ నరేష్ నాయక్

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని జై సేవాలాల్ భూక్యా రెడ్డి తండాలో సర్పంచ్ నరేష్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు రసాయనాల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.వ్యవసాయంలో అధికంగా రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, వాటి ప్రభావంపై ప్రజలకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో డ్రోన్‌ల ద్వారా పురుగుమందుల పిచికారీ విస్తరిస్తోంది. దీని వల్ల తక్కువ సమయంలో ఎక్కువ భూమిని కవర్ చేయగలిగినా, పర్యావరణం, ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడే ప్రమాదం ఉందని తెలిపారు.

పంజాబ్ రాష్ట్రంలో అధిక రసాయన వినియోగం కారణంగా క్యాన్సర్ కేసులు పెరిగిన ఉదాహరణను ప్రస్తావిస్తూ, అదే పరిస్థితి తెలంగాణలో కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. రసాయన అవశేషాలు ఆహారంలోకి చేరడం, నీటి వనరులు కాలుష్యానికి గురికావడం, గాలి ద్వారా వ్యాప్తి చెందడం వంటి అంశాలు ప్రజల ఆరోగ్యానికి హానికరమని వివరించారు.ప్రత్యేకంగా డ్రోన్ పిచికారీ ద్వారా రసాయనాలు గాలి ద్వారా సమీప గ్రామాలకు వ్యాపించి, మనుషులు, పశువులు, పక్షులపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.దీర్ఘకాలికంగా ఇది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.

రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగంపై కట్టడి, సహజ వ్యవసాయం (ఆర్గానిక్ ఫార్మింగ్) ప్రోత్సాహం, డ్రోన్ పిచికారీపై కఠిన నియంత్రణలు, రైతులకు అవగాహన కార్యక్రమాల నిర్వహణ ప్రజల ఆరోగ్యం కాపాడటానికి ప్రభుత్వం, అధికారులు, రైతులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. లేకపోతే పంజాబ్ లాంటి పరిస్థితులు తెలంగాణలో కూడా ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు పాల్గొన్నారు.