04-12-2025 12:00:00 AM
రంగారెడ్డి, డిసెంబర్ 3 ( విజయ క్రాంతి): పంచాయతీ ఎన్నికలలో ప్రధానంగా పైసల్దే పై చేయి కనిపిస్తుంది. ఏ పల్లె, ఏ తండా చుసినా బరిలో నిలిచిన అభ్యర్థులు ఖర్చుకు సైతం ఎక్కడ వెనకాడడం లేదు. ఎలాగైనా సర్పంచ్ కీరిటం దక్కించుకోవాలని కృత నిశ్చయంతో వ్యూహాలు పన్నుతున్నారు. తమ ప్రత్యర్థి ని ఎన్నికల రణబేరి లో ఓడించేందుకు భారీగా ఖర్చు పెట్టేందుకు సై అంటున్నారు.
బరిలో ఉన్న అభ్యర్థులు ఓట్ల వేటలో తమ స్థాయికి మించి ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. చేతిలో చిల్లీ గవ్వ లేకున్నా సరే ఎన్నికల కోసం అప్పులు చేస్తున్నారు. కొందరూ అభ్యర్థులు తమ భూములు, బంగారం సైతం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నారు. అందుకోసం దగ్గరి బంధువులు, పరిచయం ఉన్నవాళ్లు, వడ్డీ వ్యాపారుల ఇండ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఈసారి ప్రధానంగా యువత సర్పంచ్ బరిలో నిలవడం తో డబ్బు ప్రభావం కనబడుతుంది.
బరిలో నిలిచిన అభ్యర్థులు
ఓటర్లను ఆకర్షిం చేందుకు తాయిలాలు ఎరవేస్తూ పడరాని పాట్లు పడుతున్నారు. అధికార పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఎంత ఖర్చయినా పెట్టడానికి వెనకాడడం లేదు. కొందరైతే తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని కూడా పట్టించుకోకుండా అప్పులు చేసైనా సరే విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఎన్నికలకు సై కొడుతున్నారు.
తగ్గేదేలే..
తండాలు, మైదాన పంచాయతీలు ఎక్కడ చుసిన ఇదే సీన్ కనిపిస్తుంది. కొన్ని పంచాయతీల్లో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, బంధువుల మధ్య పోటీ తీవ్రత ఉంది.చిన్న చిన్న పంచాయ తీల్లో సైతం పోటీ తీవ్రంగానే ఉంది. తొలి, రెండవ విడతలో ఎన్నికల లో ప్రతీచోట ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్,బిజెపి మరి కొన్ని చోట్ల బీఎస్పీ పార్టీల తరఫున అభ్యర్థులు బరిలో నిలవగా మరి కొన్ని చోట అధికార, ప్రతిపక్ష పార్టీలు సైతం కలిసిపోయి పోటీ చేస్తున్నారు.
మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ప్రధానంగా ఫ్యూచర్ సిటీ పరిధి లో వచ్చే ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూరు, కడ్తాల మండలా లో ని గ్రామాల్లో పోటీ తీవ్రంగా ఉంది. గతంలో పదవులు అనుభవించిన ఎంపీపీ జడ్పిటిసి, సింగిల్ విండో చైర్మన్ లు సైతం సర్పంచ్ బరిలో నిలిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
తొలి విడత ఎన్నికలు 11,రెండవ విడుత 14, మూడో విడత 17 నా ఎన్నికలు ఉండగా... మొదటి విడతలో బరిలో నిలిచినా వారు ఇప్పటికే ప్రచారం మొదలెట్టారు. ఎన్నికల సమయం దగ్గరగా ఉండగా, రెండు, మూడు విడతల్లో జరిగే ఎన్నికలకు మరో ఐదారు రోజులు ఎక్కువ సమయం ఉండడంతో అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపడవుతుంది.
గంప గుత్తగా పడే ఓట్లపైనే..
కులసంఘాలు, మహిళ సంఘాలు, యువజన సంఘాలు ఇలా గంపగుత్తగా ఓట్లు పడే వారి పై ప్రధాన ఫోకస్ పెడుతున్నారు. వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పుతున్నారు. చిన్న పంచాయతీల్లో సైతం ఒక్కో అభ్యర్థి రూ. 10 లక్షలు ఖర్చు చేసే పరిస్థితి ఉం ది. మామూలు పంచాయతీల్లో రూ. 10 నుంచి లక్షల నుంచి రూ.20 లక్షల దాకా, పెద్ద పంచాయ తీల్లో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా ఖర్చు...
మండల పంచాయతీ, పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న పంచాయతీల్లో కోటికి పైగా ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు. అందుకు అన్ని వనరులను సరుకు,సరంజాను సిద్ధం చేసుకునే పనులో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. మరి కొన్ని పంచాయతీల్లో ఎలాగైనా సర్పంచ్ పీఠం దక్కించుకోవాలని ఆశతో ఉన్న వారంతా తమ మద్దతు దారులను రంగంలోకి దింపారు. ఆ గ్రామంలో ఖర్చు చేసే డబ్బులకు.
అదనంగా డబ్బులు జోడించి రూ.50 లక్షల నుంచి..రూ. 60 లక్షల వరకు వేలంపాట ద్వారా పదవులను దక్కించుకుంటున్నారు. ఇటీవల షాద్నగర్ నియోజకవర్గం, మాడుగుల మండలాల్లో కొన్ని పంచాయతీల్లో ఈ వ్యవహరం నడుస్తుంది. ప్రజలు తాయిలాల ఎరకు తమ ఓటును వేస్తారో లేదో... ఎన్నికలు అయిపోయాక డబ్బా విప్పినప్పుడే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.