ఏరుదాటి తెప్ప తగలేసి..
ముదిమి వయసులో నేతల జంపింగ్ జపాంగ్
అధికారం కోసం పార్టీలు మారుతున్న వృద్ధ నేతలు
ప్రాధాన్యం లేక కొందరు.. అన్నీ అనుభవించి మరికొందరు
కేకే, కడియం, ఇంద్రకరణ్, మందా.. అందరిదీ అదే దారి
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): ముదిమి వయసులోనూ జంపింగ్ జపాంగ్ అంటున్నారు కొందరు రాజకీయ నేతలు. ఎక్కడ ఉన్నా అధికారం కోసమే రాజకీయం అన్నట్లుగా పార్టీలు మారుతున్నారు. తమ కోసమో, తమ పిల్లల కోసమో పార్టీలు మారి అధికారాన్ని దక్కించుకుంటున్నారు. అప్పటికే ఉన్న పార్టీల్లో అధికారం అనుభవించి సదరు పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్లగానే అధికారంలోకి వచ్చిన పార్టీలోకి దూకేస్తున్నారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌లో అధికారం అనుభవించిన కే కేశవరావు (85), ఏ ఇంద్రకరణ్‌రెడ్డి (75), కడియం శ్రీహరి (72), మందా జగన్నాథం (73), పోతుగంటి రాములు (72) వంటి వృద్ధ నేతలు ప్రభుత్వం మారగానే కాంగ్రెస్‌లో చేరిపోయారు. బీఆర్‌ఎస్‌లో తమకు ప్రాధాన్యం దక్కలేదని రాములు, జగన్నాథం పార్టీని వీడినట్లు తెలుస్తోంది. ఇక మండలి చైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి (70) కుమారుడు గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండలి చైర్మన్ పదవిలో ఉండి పార్టీ మారడం నైతికతకు సంబంధించిన విషయంగా భావించి సుఖేందర్‌రెడ్డి పార్టీ మారడం లేదు కానీ ఆయన కూడా బీఆర్‌ఎస్‌తో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిందన్న గుత్తా వ్యాఖ్యలు పార్టీకి ఆయన దూరంగా వెళ్లిపోతున్నారని చెప్పకనే చెప్తున్నాయి. ప్రస్తుతం గుత్తా సాంకేతికంగా మాత్రమే పార్టీలో ఉన్నారు.
అందలం ఎక్కించినా కారు దిగారు
కాంగ్రెస్ పార్టీకి చెందిన కే కేశవరావు ఆ పార్టీలో అనేక పదవులు అనుభవించారు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్) పార్టీలో చేరారు. పార్టీలో కేసీఆర్ ఆయనకు తన తర్వాత స్థానాన్ని కట్టబెట్టారు. పార్టీ కార్యక్రమాల్లోనూ కేకేకు కేసీఆర్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. అడిగిన వెంటనే ఆయన కూతురు గద్వాల్ విజయలక్ష్మికి హైదరాబాద్ మేయర్ పీఠం కట్టబెట్టారు. అన్నీ అనుభవించిన ఆయన.. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఆయన కూతురు కూడా పార్టీ మారారు.
రాజయ్య సీటును కట్టబెట్టినా ఆగని కడియం
టీడీపీ నుంచి బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరికి ఇక్కడ మంచి అవకాశాలే వచ్చాయి. 2014లో ఎంపీగా ఎన్నికై పదవిలో ఉండగానే... 2015లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం పొంది నేరుగా డిఫ్యూటీ సీఎం అయ్యారు. ఆ తర్వాత కూడా మరోసారి ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం ఇచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని కడియంకు స్టేషన్ ఘన్‌పూర్ టిక్కెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన కూతురు కావ్యకు వరంగల్ నుంచి బీఆర్‌ఎస్ తరఫున ఎంపీ టికెట్ కూడా ఖరారు చేశారు. అయితే అప్పటివరకు పార్టీలో ఎలాంటి ఇబ్బందులు లేని కడియం ఫ్యామిలీకి ఒక్కసారిగా బీఆర్‌ఎస్ పార్టీ చేదుగా మారిపోయింది. వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి కూతురుకు వరంగల్ ఎంపీ టికెట్ ఖరారు చేసుకున్నారు.
అధికారం ఎక్కడుంటే అక్కడే
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్‌రెడ్డి పార్టీలు మారడంలో దిట్ట. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో బీఎస్పీ టికెట్‌పై గెలిచి టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ఆ పార్టీలో చేరి మంత్రి అయ్యారు. 2018లో నేరుగా కారు గుర్తుపై పోటీచేసి మరోసారి మంత్రయ్యారు. 2023లో నిర్మల్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. పదేళ్లపాటు పదవులు అనుభవించిన ఇంద్రకరణ్... పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెనకాముందు చూసుకోకుండా కాంగ్రెస్‌లోకి దూకేశారు.
ఉమ్మడి పాలమూరులో ఇద్దరు దళిత నేతలు కూడా
నాగర్ కర్నూలు ఎంపీగా పనిచేసిన మందా జగన్నాథం 2014లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున మరోసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అదే ఏడాది ఆయన కుమారుడు మందా శ్రీనాథ్‌కు అలంపూర్ ఎమ్మెల్యే టికెట్ కూడా పార్టీ ఇచ్చింది. అక్కడ శ్రీనాథ్ కూడా ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగారు. ఢిల్లీలో పార్టీ అధికార ప్రతినిధిగానూ పనిచేశారు. అయితే 2019, 2023లో ఆయనకుగానీ, ఆయన కుమారునికి గానీ పార్టీ టికెట్లు లభించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మందా జగన్నాథం.. అక్కడా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు.
తనకు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కకపోవడంతో కాంగ్రెస్‌ను వీడి బీఎస్పీలో చేరారు. ప్రస్తుతం బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ అయిన పోతుగంటి రాములు కూడా బీఆర్‌ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. గత ఐదేళ్లుగా పార్టీలో తమకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పాటు తన కుమారునికి ఎస్సీ కోటాలో జెడ్పీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉన్నా పార్టీ అధిష్టానం చెప్పుడు మాటలు విని తమను పెడచెవిన పెట్టిందనే ఉక్రోషంతో సరిగ్గా ఎన్నికల సమయంలో పార్టీ వీడారు. ప్రస్తుతం పోతుగంటి రాములు కుమారుడు పోతుగంటి భరత్ నాగర్ కర్నూలు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు.




