‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వలేం!
- తమ పరిశీలనలో లేదని కేంద్రం స్పష్టీకరణ
- కృష్ణా జలాల వివాదమే అడ్డంకి
- ట్రిబ్యునల్‌లో తేలాకే కదలిక
- సమగ్ర ప్రతిపాదనతో రావాలని రాష్ట్రానికి సూచన
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి) : పాలమూరు ఎత్తిపోతల పథకానికి (పీఆర్‌ఎల్‌ఐఎస్) జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించే అంశంపై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని తేల్చి చెప్పింది. కృష్ణా జిలాల వివాదం, తెలంగాణ మధ్య నీటి పంపకాల అంశం ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నందున ప్రాజెక్టుకు టెక్నో ఎకనామిక్ అప్రైజల్‌ను కూడా చేపట్టలేమని తేల్చి చెప్పింది.
కృష్ణా జలాల వివాదం పరిష్కారమయ్యే వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశంపై ముందడుగు పడే పరిస్థితి కనిపించడం లేదు. జాతీయ హోదా ద్వారా కేంద్రం నుంచి భారీ ఆర్థిక సాయం పొందాలని తెలంగాణ ప్రభుత్వం చాలాకాలంగా చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం మరోసారి అడ్డంకిగా మారింది. ఇదే కారణంతో పీఆర్‌ఎల్‌ఐఎస్ డీపీఆర్‌పై ముందుకు వెళ్లలేమని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కూడా 2026 జనవరిలోనే తెలంగాణకు స్పష్టం చేశారు.
డీపీఆర్ ఉన్నా.. అప్రైజల్‌కు అడ్డంకులు
పాలమూరు ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వం 2022 సెప్టెంబర్‌లో కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ)కు టెక్నో ఎకనామిక్ అప్రైజల్ కోసం సమర్పించింది. అయితే కృష్ణా జలాలపై కొత్తగా ఏర్పడిన న్యాయ, ట్రిబ్యునల్ పరిణామాల కారణంగా.. ప్రాజెక్టు నీటి లభ్యత, కేటాయింపులు, అంతర్రాష్ట్ర ప్రభావాలపై తుది స్పష్టత లేకుండా అప్రైజల్ చేయడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. సమస్య కేవలం డీపీఆర్‌లో సాంకేతిక లోపాలు ఉన్నాయా?
లేదా అన్నది మాత్రమే కాకుండా ప్రాజెక్టుకు అవసరమైన నీరు ఎక్కడి నుంచి? ఆ నీటిపై తెలంగాణకు ఎంత హక్కు? భవిష్యత్తులో కృష్ణా జలాల తుది కేటాయింపు ఎలా ఉంటుంది? అన్న అంశాలపైనే అసలు చిక్కు కేంద్రీకృతమై ఉంది. తాజాగా కేంద్రం తెలంగాణకు మరోసారి సమగ్ర ప్రణాళికతో రావాలని సూచించింది. పీఆర్‌ఎల్‌ఐఎస్ ద్వారా ఆశించిన ప్రయోజనాలు పూర్తిగా ఎలా సాధిస్తారో, నీటి లభ్యతను ఎలా నిర్ధారిస్తారో, ప్రాజెక్టు అమలు, ఆర్థిక అంశాలు ఎలా ఉంటాయో స్పష్టంగా వివరించే సమగ్ర ప్రణాళికను సమర్పించాలని కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సమర్పించిన డీపీఆర్‌ను కేంద్రం తిరిగి పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇది రాష్ట్రానికి మరో సవాలుగా మారింది. ఎందుకంటే డీపీఆర్ ఆమోదం లేకుండా ప్రాజెక్టు పూర్తిస్థాయి సాంకేతిక, ఆర్థిక ప్రక్రియ ముందుకు సాగడం కష్టమవుతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేస్తామని ప్రకటిస్తోంది.
సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పనులకు గడువులు నిర్దేశించారు. అయితే జాతీయ హోదా లభిస్తే కేంద్ర నిధుల మార్గం సుగమం అవుతుందన్న ప్రభుత్వ అంచనాలకు తాజా పరిణామం అడ్డంకిగా మారింది. రాష్ట్ర ఖజానాపై ఒత్తిడి ఉన్న సమయంలో పీఆర్‌ఎల్‌ఐఎస్ వంటి భారీ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సమీకరించడం తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారనుందని తెలుస్తోంది.






