16 July, 2026 | 2:38 AM

హైదరాబాద్ బియ్యంలో క్యాన్సర్ కారకాలు!

07-06-2024 02:14 AM

అఫ్లాటాక్సిన్ ఉన్న రైస్ విక్రయాలే కారణం 

దీనితో లివర్ క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధులు

ఎన్‌ఐఎన్ పరిశోధనలో సంచలన విషయాలు 

నివారణ చర్యలు అవసరం అంటున్న నిపుణులు

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని రిటైల్ షాపుల్లో బియ్యం కొంటున్నారా? రోజూ అవే తింటున్నారా? అయితే మీరు ఇప్పటి నుంచి జాగ్రత్తపడాల్సిందే. నగరంలోని షాపుల్లో లభ్యమవుతున్న బియ్యంలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. నగరంలో ప్రమాద కర అఫ్లాటాక్సిన్(ఏఎఫ్)తో కలుషితమైన బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

అఫ్లాటాక్సిన్ స్థాయి పరిమితికి మించి ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) హెచ్చరించింది. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) ఆధ్వర్యంలో నగరంలోని సికింద్రాబాద్, సీతాఫల్‌మండి, ఉప్పల్, మౌలాలీ, కోఠిలోని 10 రిటైల్ షాపుల్లో దాదాపు 2 కిలోల పరిమాణంలో 50 నమూనాలపై చేసిన అధ్యయనంలో తాజా విషయాలు వెల్లడయ్యాయి.

ఈ బియ్యం వల్ల చాలా మంది హైపాటోసెల్లార్ కార్సినోమా (హెచ్‌సిసీ) బారిన పడుతున్నట్లు తేలింది. లివర్‌కు వచ్చే క్యాన్సర్‌ను ఈ పేరుతో పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాల్లో హెచ్‌సీసీ మూడో స్థానంలో ఉంది. అఫ్లాటాక్సిన్ కాలుష్య స్థాయి, తిన్న తర్వాత జీర్ణమయ్యే సమయం ఆధారంగా నగరవాసుల హెల్త్ రిస్క్‌ను ఎన్‌ఐఎన్ బృందం అంచనా వేసింది. ఏఎఫ్ కలిసిన బియ్యం వల్ల చిన్నారులు, కౌమార, పెద్దలు అని తేడా లేకుండా అన్ని వయసుల వారికి సిర్రోసిస్ తరహాలో లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.

లక్షణాలు ఇవే.. 

అఫ్లాటాక్సిన్లు శరీరంలోకి ప్రవేశించిన వెం టనే వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. వికారం, వాంతులు, పొత్తికడుపులో నొప్పి, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ దీర్ఘకాలంగా అవి శరీరంలో ఉన్నట్లయితే హెపాటోటాక్సిసిటీ, ఇమ్యూనో టాక్సిసిటీ, టెరాటోజెని సిటీ వంటి అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చని అధ్యయంలో తేలింది. 

పాశ్యాత్య దేశాల్లో హెచ్‌సీసీకి అఫ్లాటాక్సిన్లు ప్రధాన కారణమని తాజా పరిశోధనలో వెల్లడించారు. అయితే బియ్యంతో పాటు ఇతర ఆహా ర ఉత్పత్తుల్లో అఫ్లాటాక్సిన్‌ల కలుషితాన్ని తగ్గించడం వల్ల ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చని పేర్కొన్నారు. ముఖ్యం గా అభివృద్ధి  చెందుతున్న దేశాల్లో వీటి సమస్య తీవ్రంగా ఉందని, అందుకే ఆహార ఉత్పత్తి, నిల్వ, పంపిణీ వంటి దశల్లో ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎన్‌ఐఎన్, ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.

అఫ్లాటాక్సిన్ అంటే..

అఫ్లాటాక్సిన్స్‌ను అత్యంత శక్తమంతమైన క్యాన్సర్ కారకాల్లో ఒకటిగా చెబుతారు. ఇవి మానవుని ఆరోగ్య వ్యవస్థను వేగంగా దెబ్బతీస్తాయి. ఇవి వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి గింజలు, సుగంధ ద్రవ్యాలు, చెట్ల కాయలు వంటి వ్యవసాయ ఉత్పత్తుల్లో వృద్ధి చెందుతాయి. అయితే ఇవి తక్కువ మోతా దులో ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. స్థాయికి మించి ఉంటేనే పలు రకాలు క్యాన్సర్లు, దీర్ఘకాలిక అనారోగ్యాలకు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అఫ్లాటాక్సిన్స్‌లో రెండు రకాల జాతులు ఉంటాయి. వాటిని ఏఎఫ్‌బీ1, ఏఎఫ్‌బీ2గా విభజించారు. ఏఎఫ్‌బీ1అనేది చాలా ప్రమాదకర మైంది.

ఎన్‌ఐఎన్ పరిశోధనలో హైదరాబాద్‌లోని బియ్యంలో 51 శాతం ఏఎఫ్‌బీ1, 34 శాతం ఏఎఫ్‌బీ2 ఉన్నట్లు పరిశోధకులు గుర్తంచారు. ఒక కేజీ బియ్యంలో ఏఎఫ్‌బీ1 సాంద్రత 0-20.35మిల్లీ గ్రాములు, ఏఎఫ్‌బీ2 సాంద్రత 0-1.54మిల్లీ గ్రాములు ఉన్నట్లు తేల్చారు. ఏఎఫ్‌బీ1 అనేది అత్యంత విషపూరితమైనదని డబ్ల్యూహెచ్‌ఓకు అనుబంధంగా పనిచేసే ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ క్యానర్స్ (ఐఏఆర్‌సీ) తన పరిశోధనలో గుర్తించింది. ఏఎఫ్‌బీ1 కారకాలు ఉన్న బియ్యాన్ని తినడం వల్ల ఎక్కువ లివర్ క్యాన్సర్స్, హెపటైటీస్, సిర్రోసిస్ వచ్చే అవకాశం ఉందని ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.