16 July, 2026 | 2:29 AM

గురువులు కరువు!

07-06-2024 02:15 AM

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత

నాలుగైదు రోజుల్లో స్కూళ్లు పునః ప్రారంభం

సర్కారీ బడుల్లో వెక్కిరిస్తున్న ఖాళీ పోస్టులు

సందిగ్ధంలో విద్యా వలంటీర్ల నియామకాలు

జహీరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): సర్కారు సూళ్లపై తల్లిదండ్రుల్లో ఆసక్తి పెరుగుతున్నా ఉపాధ్యాయుల కొరత వెనక్కి లాగుతోంది. సరిపడ టీచర్లు లేకపోవడంతో చేర్పించాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడుతున్నారు. అవసరమైన మేరకు టీచర్లను నియమించకపోవడంపై ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ (లాక్‌డౌన్) తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకం చేపట్టకపోవడంపై తల్లిదండ్రు లు ఆందోళన చెందుతున్నారు.

నాలుగైదు రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. గత ఏడాది పాఠశాలల్లో ఉపాధ్యా య పోస్టుల ఖాళీల ప్రభావంతో ఉత్తీర్ణత శాతం తగ్గిం ది. కొన్ని చోట్ల ఖాళీలు ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు చేసినా ఫలితం లేకుం డా పోయింది. మూతపడిన పాఠశాలలను తెరిపించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం సంబంధిత అధికారులు నివేదికలను సిద్ధం చేశారు. అలాగే పాఠశాల ప్రారంభం నాటికీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ప్రత్యామ్నాయంగా విద్యావలంటీర్లతో భర్తీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. బోధన కష్టాలు తీరుతాయనుకున్నా విద్యార్థులకు ఈ ఏడాది కూడా నిరాశ తప్పేలా లేదు. 

విద్యా వలంటీర్లు వస్తారా..?

కొవిడ్ అనంతరం విద్యావలంటీర్ల నియామకం నిలిచిపోయింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విద్యాలంటీర్లను నియామకం చేపడుతుందా.. లేదా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. జహీరాబాద్ నియోజవర్గం లోని న్యాల్‌కల్, జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, కోహీర్ మండలాల్లో 287 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.  ఆయా పాఠశాలల్లో 1428 మంది ఉపాధ్యాయులుండాల్సి ఉండగా, 1147 మంది మాత్రమే బోధిస్తున్నారు. 282 మంది పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయ డం లేదు. ఉన్నవారితోనే నెట్టుకురావడం వల్ల ఉపాధ్యాయులపై  అదనపు భారం పడుతుంది. ఫలితంగా ఆయా మండలాల్లోని  ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు వెక్కిరిస్తున్నాయి. ఆయా స్థానాల్లో కనీసం విద్యావలంటీర్లను నియమిస్తారా? లేదా వేచిచూడాలి.