25 August, 2026 | 3:43 AM

వాహనాల తనిఖీల్లో 149 మందిపై కేసులు

25-08-2026 01:49 AM

‘డ్రంక్ అండ్ డ్రైవ్’లో 89 మందికి రూ.4.78 లక్షల ఫైన్

లైసెన్స్ లేని 60 మందికి రూ. 2.32లక్షల జరిమానా

సిద్దిపేట క్రైం, ఆగస్టు 24(విజయక్రాంతి) : సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు సిబ్బందితో కలిసి గత కొన్ని రోజులుగా విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 89 మంది పట్టుబడ్డారు. పట్టుబడిన వారిని ఈ వారంలో సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచారు. కేసులను విచారించిన న్యాయమూర్తి 89 మందికి కలిపి రూ.4 లక్షల 78 వేల 5 వందలు జరిమానా విధించారు.

వారిలో ఐదుగురికి ఐదు రోజుల చొప్పున, ఒకరికి 10 రోజులు, మరొకరికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన 60 మందిపై కూడా కేసులు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి వారికి మొత్తం రూ.2 లక్షల 32వేలు జరిమానా విధించారని సీఐ ముత్యంరాజు తెలిపారు.