calender_icon.png 19 August, 2025 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా సరఫరాలో కేంద్రం విఫలం

18-08-2025 01:02:08 AM

  1. కేటాయింపులను పూర్తిగా సరఫరా చేయడం లేదు 
  2.   20 వేల మెట్రిక్ టన్నులు అదనంగా కేటాయించాలి
  3. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఎరువుల కొరత 
  4. రైతులను తప్పుదోవ పట్టించడం సరికాదు 
  5. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు  

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): రాష్ట్రానికి కేటాయించిన యూరియాను సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. కేంద్రం కేటాయించిన 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటివరకు కేవలం 5.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేసిందని, తద్వారా 2.69 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఏర్పండిందని తెలిపారు.

యూరియా కొరతపై ఆదివారం సచివాలయంలో సంబంధిత అధికారులో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేటాయించిన 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో స్వదేశీ యూరియా 4.34 లక్షల మెట్రిక్ టన్నులు, దిగుమతి యూరియా 3.96 లక్షల మెట్రిక్ టన్నులు ఉందన్నారు. ఇందులో స్వదేశీ యూరియాలో 3.27 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, దిగుమతి యూరియాలో 2.05 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేశారని తెలిపారు.

స్వదేశీ యూరియా ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి సరఫరా కావాల్సి ఉండగా, ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 145 పనిదినాలకు గాను, 78 రోజులు ఉత్పత్తి జరగకపోవటం వలన రాష్ట్రానికి సరఫరా కావాల్సిన యూరియాలో పెద్ద లోటు ఏర్పడిందన్నారు. కొన్ని నెలల్లో కొన్ని కంపెనీలు అసలు సరఫరానే చేయలేదన్నారు.

ఈ విషయాలేమి తెలుసుకోకుండా బీజేపీ నాయకులు నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ  రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ యూరియా కొరత ఉందన్నారు. రాష్ట్రానికి సరిపడా యూరియా కేటాయించాలని ఎంపీలు కూడా కేంద్రమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలే దన్నారు.

సీజన్ ముందస్తుగా ప్రారంభం కావడంతోనే

సీజన్ ముందుస్తుగా ప్రారంభం కావడం, మొక్కజొన్న లాంటి పంటలు అధికంగా సాగు చేయడం వలన, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నల్గొండ, గద్వాల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి లాంటి జిల్లాలలో  అధికంగా యూరియా అమ్మకాలు జరిగాయన్నారు. యూరియాను ఇతర అవసరాల కోసం మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష చేయాలని వ్యవసాయ శాఖ కార్యదర్శికి సూచించారు.   

20 వేల మెట్రిక్ టన్నుల యూరియా

రాష్ట్రానికి కేటాయించిన దిగుమతి యూరియా సరఫరా కోసం వచ్చే 4 నౌకలు ఈ నెలాఖరు వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు వివరించారు. ప్రతి నౌక నుంచి అదనంగా 20 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించే విధంగా కేంద్రానికి లేఖలు రాయాలని మంత్రి అదేశించారు. సీజన్‌కు ముందే 5 రకాల ఎరువులను కేంద్రం కేటాయించిందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి తెలిపారు.

ఇందులో యూరియా 9.80 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంవోపీ, ఎస్‌ఎప్‌పీలు 13.95 మెట్రిక్ టన్నులు ఉన్నాయన్నారు. సమీక్షలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హాకా ఎండీ చంద్రశేఖర్, మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి, ఆగ్రోస్ ఎండీ రాములు, అధికారులు పాల్గొన్నారు.