22-05-2025 12:00:00 AM
మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖకు స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
హుస్నాబాద్, మే 21 : మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఫలిస్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట మీదుగా జనగామ జిల్లా కేంద్రం వరకు ఉన్న డబుల్ లైన్ రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా మార్చాలంటూ ఆయన కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాసిన లేఖకు సానుకూల స్పందన లభించింది.
ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈనెల 5వ తేదీన ఆయనకు రాసిన లేఖలో, హుస్నాబాద్ నుంచి జనగామ వరకు ఉన్న 52 కిలోమీటర్ల డబుల్ లైన్ రహదారిని నాలుగు లైన్లుగా అప్‌గ్రేడ్ చేయాల్సిన ఆవశ్యకతను మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.
జిల్లా కేంద్రాలకు అనుసంధానం : ఈ రహదారి కరీంనగర్, సిద్దిపేట, జనగామ జిల్లాలను కలిపే హుస్నాబాద్ పట్టణం గుండా వెళుతుంది. ఇది హైదరాబాద్-కరీంనగర్-రామగుండం రోడ్ (ఎస్ హె-1) నుంచి ఎల్కతుర్తి-సిద్దిపేట రోడ్ (ఎన్ హె-765 డీజీ), జనగామ-ఎన్ హె డీ-36 వంటి ముఖ్యమైన రహదారులకు అనుసంధానంగా ఉంది.
ప్రాంతీయ ప్రాధాన్యం : ఈ రహదారి ఆరు మండల ప్రధాన కార్యాలయాలకు, మూడు అసెంబ్లీ ప్రధాన కార్యాలయాలకు, రెండు జిల్లా ప్రధాన కార్యాలయాలకు కీలకమైన కనెక్టివిటీని అందిస్తుంది. అంతేకాకుండా మూడు ముఖ్యమైన జాతీయ రహదారులను కలుపుతుంది.
ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం : కరీంనగర్ నుంచి జనగామకు ఇప్పుడు అతి చిన్న మార్గం ఇదే కావడంతో, ఈ రహదారిపై అంతర్రాష్ర్ట వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. రహదారి విస్తరణతో ట్రాఫిక్ రద్దీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
ఆర్థిక అభివృద్ధికి ఊతం : ప్రస్తుతం ఉన్న రహదారి శ్రీరాంసాగర్, గౌరవెల్లి ప్రాజెక్టుల కింద ఉన్న వ్యవసాయపరంగా సంపన్నమైన, బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం గుండా వెళుతుంది. రహదారి విస్తరణ ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి మరింత ఊతమిస్తుంది.
ఆలయ క్షేత్రాలకు అనుసంధానం : ప్రతిపాదిత జాతీయ రహదారి కొమరవెల్లిలోని మల్లన్న దేవాలయం, కొలనుపాకలోని జైన దేవాలయం, యాదగిరిగుట్టలోని నరసింహస్వామి దేవాలయాలు వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కలుపుతుంది. దీంతో పర్యాటకుల రాకపోకలు పెరిగి, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది.
ప్రధాన పట్టణాల అనుసంధానం : ఈ మార్గం కరీంనగర్-కొత్తపల్లి-చిగురుమామిడి-హుస్నాబాద్-అక్కన్నపేట-తరిగొప్పుల-నర్మెట్ట-వడ్లకొండ-జనగామ వంటి ప్రధాన పట్టణాలను అనుసంధానిస్తుంది.
రహదారి విస్తరణతో సర్వతోముఖాభివృద్ధికి అవకాశాలు
ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే కేవలం రవాణా సౌకర్యం మెరుగుపడడమే కాకుండా, ఈ రహదారి పొడవునా ఉన్న గ్రామాలు సైతం గణనీయంగా అభివృద్ధి చెందుతాయి. వేగవంతమైన రవాణా, పెరిగిన వాణిజ్య కార్యకలాపాలతో కొత్తగా హోటళ్లు, పెట్రోల్ బంకులు, ఇతర వ్యాపార సంస్థలు వెలుస్తాయి. ఇది స్థానిక గ్రామీణులకు ఉపాధి అవకాశాలను సృష్టించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. ఈ ప్రాంతానికి ఇది ఒక సమగ్ర అభివృద్ధి ప్రణాళికగా మారనుంది.