మియాపూర్‌లో చైన్ స్నాచర్ అరెస్ట్
శేరిలింగంపల్లి, జూలై 13 (విజయక్రాంతి): రాత్రి సమయంలో బస్టాప్ వద్ద ఓ వృద్ధురాలి మెడలోని బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన చైన్ స్నాచర్ను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ కెమెరాల దృశ్యాలు, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి దొంగిలించిన బంగారు సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు వివరాల ప్రకారం, బాచుపల్లి క్రాంతినగర్కు చెందిన ఒడ్డిరాజు భారతి తన భర్త దామోదర్ రావుతో కలిసి హన్మకొండలో ఒక శుభకార్యానికి వెళ్లి,ఆర్టీసీ బస్సు ద్వారా మియాపూర్ ఎక్స్రోడ్డు బస్టాప్కు చేరుకున్నారు.ఆటో కోసం వేచి ఉండగా, వెనుక నుంచి వచ్చిన దుండగుడు ఆమె మెడలోని మంగళసూత్రం, చంద్రహారంను లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు రంగంలోకి దిగి, సీసీటీవీ ఫుటేజ్లను సమీక్షించారు.
నిందితుడు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతానికి చెందిన కుక్కల నరేంద్ర (23) అనే వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి, అతనిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్దనుండి చోరీచేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు నిందితుడిని కోర్టు సమక్షంలో హాజరు పరచి రిమాండ్కు తరలించారు. సొత్తును చట్టపరమైన విధానాలు పూర్తి చేసి బాధితురాలికి అందజేస్తామని పోలీసులు అధికారులు తెలిపారు. అయితే రాత్రి సమయంలో మహిళలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే 100కి ఫోన్ చేయాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






