1 July, 2026 | 1:11 AM

చాంపియన్స్‌కు సవాల్

01-07-2026 12:00 AM

ఐర్లాండ్ చేతిలో క్లీన్‌స్వీప్ పరాభవానికి గురైన టీమిండియా ఇప్పుడు ఇంగ్లీష్ సవాల్‌కు సిద్ధమైంది. పేస్ పిచ్‌లు స్వాగతం పలుకుతున్న వేళ భారత బ్యాటర్లకు ఈ టీ20 సిరీస్ అగ్నిపరీక్షగా చెప్పాలి. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీకి, గంభీర్ వ్యూహాలకు కూడా లిట్మస్ టెస్టుగా చెప్పొచ్చు. మరి ఐర్లాండ్ పిచ్‌లపై చేతులెత్తేసిన భారత్ ఇంగ్లాండ్‌లో నిలబడుతుందా ?

  1. నేడు భారత్, ఇంగ్లాండ్ తొలి టీ20
  2. తుది జట్టులో వైభవ్‌కు నో ఛాన్స్

చెస్టర్ లీ స్ట్రీట్, జూన్ 30 : భారత్, ఇంగ్లాండ్ ఐదు టీ20ల సిరీస్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఐర్లాండ్ గడ్డపై ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా బుధవారం ఇంగ్లాండ్‌తో తొలి టీ20 ఆడబో తోంది.. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ సిరీస్‌లో చేసిన తప్పులను పునరావృతం చేయకూడదని భారత్ భావిస్తోంది. ఐర్లాండ్ పేస్ పిచ్‌లపై చేతులెత్తేసిన భారత బ్యాటర్లు ఇప్పుడు ఇంగ్లీష్ కండీషన్స్‌కు తగట్టు రాణించేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆగస్టు 2023 తర్వాత భారత్ ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. టీ20 ప్రపంచకప్ -2028 సైకిల్ మొదటి సిరీస్‌లోనే భారత్ ఓటమి చవిచూసింది. ఇప్పుడు ఇంగ్లాండ్ రూపంలో మరో సవాల్ ఎదురుచూస్తోం ది.

ఒక విధంగా శ్రేయాస్ కెప్టెన్సీకి ఈ సిరీస్ కఠిన పరీక్షగా మారింది. అటు భారత బ్యాటర్లకు సైతం ఇంగ్లీష్ పిచ్‌లు సవాల్ విసురుతున్నాయి. ఐర్లాండ్ సిరీస్‌లో పరిస్థితులకు తగ్గట్టు ఆడకుండా వికెట్లు పాసేసుకుని సిరీస్ చేజార్చుకున్నారు. ఇప్పుడు కఠినమైన ఇంగ్లాం డ్ టీమ్‌పై ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తొలి టీ20 కోసం తుది జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఫైనల్ ఎలెవన్‌లో చోటు దక్కడం కష్టమే.

వైభవ్ విషయంలో తొం దరపడడం లేదని ఇప్పటికే కెప్టెన్ శ్రేయాస్ స్పష్టం చేశాడు. సుధీర్ఘమైన సిరీస్ కావడంతో అవకాశం కోసం ఎదురుచూడాలని తేల్చేశాడు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ కాంబినేషన్ మార్చేందుకు మేనేజ్‌మెంట్ సిద్ధంగా లేదనేది అర్థమవుతోంది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్ మెరుపులు మెరిపించాల్సిందే. ఫినిషర్ రోల్‌లో శివమ్ దూబే కీలకం కాబోతున్నాడు. అటు బౌలింగ్‌లో హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్‌లో పేస్ ఎటాక్‌లో ఉం టారు. స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గానూ, ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ బరిలోకి దిగ నున్నారు.

మరోవైపు కివీస్ చేతిలో టెస్ట్ సిరీస్ చేజార్చుకున్న ఇంగ్లాండ్ ఇప్పుడు టీ20 ఫార్మాట్ కోసం యువ , సీనియర్ ప్లేయర్స్‌తో ఆడబోతోంది. సొంతగడ్డపై ఇంగ్లీష్ టీమ్ ఎప్పుడూ బలంగానే ఉంటుంది. బ్యాటింగ్‌లో ఫిల్ సాల్ట్, బట్లర్, బెథల్, విల్ జాక్స్ వంటి ప్లేయర్స్ ఇటీవల ఐపీఎల్‌లో రాణించారు. అటు బౌలింగ్‌లో ఆర్చర్, డాసన్, అదిల్ రషీద్ కీలకం కాబోతున్నారు. ఇక మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న చెస్టర్ లీ స్ట్రీట్ పిచ్ బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది.