21 May, 2026 | 2:26 AM

చరిత్రలో ‘చలో చికెన్ నెక్’

21-05-2026 12:00 AM

దేశ భద్రత, జాతీయ సమగ్రత, భారత భౌగోళిక ఏకత్వం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఎన్నో ఉద్యమాలు నిర్వహించింది. అలాంటి ఉద్యమాల్లో చరిత్రలో నిలిచిపోయే ఉద్యమమే ‘చలో చికెన్ నెక్’ మహా ఉద్యమం. 2008 డిసెంబర్ 17న నిర్వహించిన ఈ భారీ ర్యాలీ దేశవ్యాప్తంగా జాతీయ చైతన్యాన్ని కలిగించింది. నేడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా, అప్పట్లో ఏబీవీపీ లేవనెత్తిన ఆందోళనలు ఎంత సముచితమో దేశం మరోసారి గుర్తిస్తోంది.

సిలిగురి కారిడార్‌గా పిలువబడే చికెన్ నెక్ ప్రాంతం భారతదేశానికి అత్యంత వ్యూహాత్మక భూభాగం. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న ఈ ప్రాంతమే ఈశాన్య భారత రాష్ట్రాలను దేశ ప్రధాన భూభాగంతో కలుపుతోంది. ఈ ప్రాంతంలో భద్రతా లోపాలు, అక్రమ చొరబాట్లు, సరిహద్దు అస్థిరత వంటి సమస్యలు దేశ సమగ్రతకు ముప్పుగా మారుతున్నాయని ఏబీవీపీ చాలా ముందుగానే హెచ్చ రించింది. ఈ నేపథ్యంలో 2008లో ఏబీవీపీ చలో చికెన్ నెక్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.

దేశం నలుమూలల నుం చి వేలాది మంది విద్యార్థులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. పోస్టర్లలో పేర్కొన్నట్లుగా సుమారు 40 వేల మంది విద్యార్థులు దేశ సమగ్రత కోసం ఒకే వేదికపై గళమెత్తారు. ‘దేశం ముందు తర్వాత’ అనే భావనతో యువత వీధుల్లోకి రావడం దేశభక్తికి ప్రతీకగా నిలిచింది. ఈ ఉద్యమం ద్వారా ఏబీవీపీ మూడు ప్రధాన అంశాలను దేశం దృష్టికి తీసుకెళ్లింది. అవి, 1. ఈశాన్య రాష్ట్రాలకు ప్రాణాధారమైన సిలిగురి కారిడార్ భద్రత. 2. అక్రమ బంగ్లాదేశీ చొరబాట్ల వల్ల ఏర్పడుతున్న ప్రమాదాలు. 3. జాతీయ భద్రత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం. అయితే, నాడు ఉద్యమ సమయంలో అనేక రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

కానీ, ఏబీవీపీ మాత్రం దేశ భవిష్యత్తు కోసం పోరాడింది. నేడు ఈ సమస్యను పరిష్కరించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి నివేదించడం ఏబీవీపీ దూరదృష్టికి నిదర్శనం. అప్పట్లో విద్యార్థి ఉద్యమంగా మొదలైన పోరాటం ఇప్పుడు జాతీయ భద్రతా చర్చగా మారింది. ఏబీవీపీ కేవలం విద్యార్థి సంఘమే కాదు; అది జాతీయ భావజాలానికి ప్రతీక. విద్యార్థుల్లో దేశభక్తి, సామాజిక బాధ్యత, జాతీయ చైతన్యం పెంపొందించడంలో ఈ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది.

స్వామి వివేకానంద ఆశయాలతో, ‘జ్ఞానం  ఏకత’ అనే నినాదంతో పనిచేసే ఏబీవీపీ దేశ సమగ్రత కోసం నిరంతరం పోరాడుతోంది. చలో చికెన్ నెక్ ఉద్యమం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది ‘దేశం కోసం లేచిన విద్యార్థి శక్తిని ఎవరూ ఆపలేరు’ అని.విద్యార్థుల గళం ఒక రోజు దేశ విధానాలను కూడా ప్రభావితం చేయగలదు. నేడు ఈ ఉద్యమ విజయాన్ని ప్రతి దేశభక్త భారతీయుడు గర్వంగా గుర్తుచేసుకుంటున్నాడు. దేశ సమగ్రత కోసం పోరాడిన ప్రతి ఏబీవీపీ కార్యకర్తకు ఇది గౌరవ క్షణం. రాబోయే తరాలకు కూడా ఈ ఉద్యమం స్ఫూర్తిగా నిలిచిపోతుంది. భారత్ మాతాకీ జై! వందే మాతరం!!

 గణేష్ గౌడ్, 9392753959, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏబీవీపీ అధ్యక్షుడు