పవన్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మరవలేను: చంద్రబాబు
అమరావతి: ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ ఏ కన్వెన్షన్ లో ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... మూడు పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో 93 శాతం గెలవడం దేశ చరిత్రంలో అరుదైన అనుభవం అన్నారు. ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారు. పవన్ కల్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మరిచిపోలేనని చంద్రబాబు తెలిపారు. తాను జైలులో ఉన్నప్పుడు పవన్ వచ్చి పరామర్శించారన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారని గుర్తుచేశారు. ఏపీ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుందని ఆయన వెల్లడించారు. ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి పనిచేశామని పేర్కొన్నారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపొందిందని చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 సీట్లలో విజయం సాధించింది. ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల ఢిల్లీలో అందరూ గౌరవించారన్నారు. ప్రజల తీర్పుతో ఏపీ ప్రతిష్ఠ, గౌరవం పెరిగిందని చంద్రబాబు తెలిపారు.






