మార్పు ప్రజల గుండెల్లోంచి రావాలి
ఏడాది పొడవునా ఏవో ఒక ఎన్నికలు జరిగే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇది రాజకీయ నాయకులకు బాగానే ఉంటుంది కానీ, సామాన్య ప్రజలకు మాత్రం కంటకప్రాయమే. ఎన్నికల జోష్‌లో పడి ప్రజాప్రతినిధులు అభివృద్ధి మాట మరుస్తున్నారు. దీంతో సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో దేన్నీ అమలు చేయలేదని ప్రతిపక్షాలు అప్పుడే విమర్శలు మొదలు పెట్టాయి. అధికార పార్టీ మాత్రం ఇప్పటికే కొన్ని హామీలను అమలు చేశామని, ఎన్నికలు ముగియగానే మిగతా హామీలను కూడా తప్పకుండా నెరవేరుస్తామని అంటోంది. అయిదు నెలల కిందట అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు. మరికొద్ది రోజుల్లో పంచాయతీ ఎన్నికలు. ఆ తరువాత మార్కెట్ కమిటీలు, సహకార సంఘాలు. ఇక, ఆ తరువాత ఎప్పుడూ వచ్చే కౌన్సిల్ ఎన్నికలు. మరి కొన్నిసార్లు ఉప ఎన్నికలు.
ఇలా ఏడాది పొడవునా ఏవో ఎన్నికలు రాష్ట్రంలో జరుగుతూనే ఉండే పరిస్థితి. భారత ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు పెద్దపీట వేయడం రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఒక గొప్ప అవకాశం. ఒకనాడు లక్షల్లో ఎవరికో ఒకరికి ప్రజాప్రతినిధిగా అర్హత లభిస్తే నేడు రాజకీయం ప్రతి ఒక్కరికి అందుతున్న తియ్య ని ద్రాక్షపండు అయింది. అందుకే, వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ సభ్యుడి దాకా విపరీతమైన పోటీ ఏర్పడింది. కోట్ల లో డబ్బుల చెలామణి జరుగుతున్నది. ప్రభుత్వంలో వున్న నాయకులు కూడా అభివృద్ధిని గాలికి వదిలేసి ఎన్నికల కోసం చాలా కష్టపడుతున్నారు. పదవి వరిస్తే ఐదేళ్లు రాజ వైభోగం, లేదంటే పైరవీలు. రాజకీయాల్లో రాణించే వాళ్లకు ఇది బాగానే ఉంటుంది కానీ, సామాన్యుడి బతుకు నిత్య పోరాటం. ఎప్పుడూ ‘పొయ్యి మీద పెనం’ లాగానే ఉంటుంది.
రెక్కాడితే గానీ డొక్కాడదు. నిత్యం జీవిత పోరాటం జరిపే వాళ్ల కష్టాల గురించి రాజకీయ నేతలకు పట్టడం లేదు. ఇటీవల కురిసిన భారీవర్షాలకు రాష్ట్రంలో పలుచోట్ల కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుని పోయింది. ఆరు నెలల కష్టం కళ్ళముందే నీటిలో కొట్టుకునిపోతూ వుంటే ఆ రైతులు పడిన బాధ, దుఃఖం ఎన్నికల హుషారులో వున్న ఏ రాజకీయ నాయకుడికీ పట్టడం లేదు.ఎన్నికల వల్ల సామాన్యుడికి ఏడైనా ఒరిగిందా అంటే ఏమీ లేదు. కూలీ బతుకుల్లో మార్పు లేదు. రైతు బతుకుల్లో మార్పు లేదు. నిరుద్యోగి జీవితంలో మార్పు లేదు. మార్పు కేవలం రాజీయాల్లోనే ఉంది. అయితే ఒక పార్టీ, లేదంటే మరొక పార్టీ. కండువాలు మార్చడమే ఆ మార్పు.
మూడేళ్లయినా తేలని ఉద్యోగాలు
దాదాపు మూడేళ్ళకింద ఏ ముహూర్తంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను ప్రకటించారో కానీ, ఇప్పటి వరకు గ్రూప్ 1,2,3,4 ఉద్యోగాలు అలాగే పడి వున్నాయి. గ్రూప్ ఉద్యోగాలు ఫలితాలు ప్రకటించి రెండు నెలలు అయిన ప్పటికీ సర్టిఫికేషన్ పరిశీలన జరగలేదు. డీఎస్సీ ఉద్యోగాలు, పోలీస్ ఉద్యోగాల భర్తీకూడా ఇంకా పూర్తి కాలేదు. ఎన్నికలు మాత్రం సజావుగా జరుగుతున్నాయి. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాల ప్రకటనతో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వానికి ఎన్నికలమీద వున్న జోష్ నిరుద్యోగ యువత గురించి ఆలోచించే సమయం లేదు. ఒక ఎన్నిక పూర్తి కాగానే మరొక ఎన్నికలకు సిద్ధం అవుతున్న ప్రభుత్వాలు అభివృద్ధి , సంక్షేమంపై కూడా కాస్త దృష్టి సారించాల్సిన అవసరం వుంది. ప్రతిదానికి ఎన్నికల కోడ్ అడ్డం వస్తుందని అనుకుంటే నెలలు, సంవత్సరాలు ఎన్నికల సమయంలోనే గడిచిపోతుంటుంది. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలంటే, ఎన్నో నూతన పరిశ్రమల స్థాపన ఈ పాటికే జరగాలి. ప్రభుత్వం ఏర్పడి అప్పుడే అయిదు నెలలు అవుతున్నది. మరొక ఏడు నెలల సమయం మాత్రమే వుంది.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయమై దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది.
పకడ్బందీగా పరీక్షలు జరపాలి
గత ప్రభుత్వం చేసిన పేపర్ లీకేజీల పొరబాట్లు పునరావృతం కాకుండా, అధికారులు, అభ్యర్థులు ఇద్దరు కూడా కోర్టుల చుట్టూ తిరగకుండా, అధికారంలో వున్న రాజకీయ నాయకుల ప్రమే యానికి ఏ మాత్రం అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలతో గ్రూప్ 1,2,3 పరీక్షలు నిర్వహించాలి. దీనితోపాటు గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్స్‌లో మిగిలిన ఉద్యోగాలకోసం పరీక్షలు నిర్వహించాలి. అలాగే, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇచ్చే కొత్త నోటిఫికేషన్స్ ప్రకారం పరీక్షలను పటిష్టమైన పద్ధతిలో నిర్వహించాలి. అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన సెలెక్ట్ చేసినపుడు ప్రభుత్వ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మార్పు పత్రికా ప్రకటనల వల్ల రాదు. ప్రభుత్వం చేసే మంచి పనులవల్ల ప్రజల జీవితాల్లో ్ల మార్పు వచ్చినట్లు అనిపించాలి. ప్రజల గుండెల్లోంచి ఆ స్పందన రావాలి. ప్రజలు విశ్వాసానికి మాత్రమే ఓటు వేస్తారు. చేసిన మంచిని జీవిత కాలంలో మరిచిపోరు. చరిత్ర చెప్పే నిజం ఇది. ప్రజల విశ్వాసంతో గెలిచిన నాయకులు కూడా నిత్యం తమ స్వార్థం కోసం కాకుండా ప్రజల గురించి ఆలోచించాలి. వారి మేలు కోసం పనిచేయాలి.
కన్నోజు మనోహరా చారి
వ్యాసకర్త సెల్ : 79950 89083






