10 May, 2026 | 7:35 AM

ఓట్ల పండగలో ఓటరు చైతన్యం

12-05-2024 12:05 AM

ఓటు ఓ వజ్రాయుధం, ఔటు అయినా.. పేలదేమో! కానీ, ఓటు మాత్రం ప్రభంజనాన్ని మించిన ప్రకంపనలు సృష్టిస్తుందని పలు సందర్భాలలో రుజువైంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రవాసాంధ్రులు, భారతీయులు సైతం ఎక్కడెక్కడి నుండో ఢిల్లీకి వచ్చి, అక్కడ్నించి హైదరాబాద్, విజయవాడ విచ్చేస్తున్నారు. అంటే, వారు తమ ఓటుహక్కుకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో చూసి ప్రజాస్వామ్యం మురిసిపోవాలి. ఆప్తులు, ఆత్మీయులకు దూరంగా ఉండి, ఆయా పరిస్థితులవల్ల రాలేని ఎన్‌ఆర్‌ఐలు కూడా ఓటు బాట పట్టడం ఆహ్వానించదగ్గ పరిణామమేకాక అద్భుత చైతన్యంగా పేర్కొనాలి. ప్రవాసాంధ్రులు- నాన్ రెసిడెంట్ ఇండియన్‌లు వారంతట వారే ‘ఓటు వేసొద్దామని వస్తున్నారా?! లేక ఇతరుల ఆహ్వానంపై స్వదేశానికి వస్తున్నారా’ అన్న విషయం పక్కన పెడితే, ‘మనం ఓటు వేయాలి. చూపుడు వేలిపై సిరా గుర్తుతో ఓటరుగా నా జన్మ ధన్యం అవ్వాలి’ అని ఒకింత సంతోషంతో ‘ఓటేద్దాం పదా’ అని పోలింగ్ తేదీకంటే ముందే సొంత గడ్డకు చేరుకుంటున్న చరిత్రను సొంతం చేసుకుంటుంది ఓటు.

‘ఇంత చైతన్యమా! ఏంటి ఈ పరిణా మం?’ అని భారత ఉపఖండం విస్తుపోయేలా.. ఆయా రాజకీయ పార్టీలు బిత్తర పోయేలా ‘మేరా ఓట్ మేరా హక్’ అని తమ చైతన్యశీల రాజకీయానికి అర్థమయ్యేలా చేస్తున్నారు భారత ఓటర్లు. ‘ఎవరు ఇన్, ఎవరు ఔట్..’ అనే తీర్పును వెలువరించే ఓటరు చుట్టూ ప్రదక్షిణలు చేసేలా రాజకీయాన్ని వంగివంగి ఓటరుకు దణ్ణం పెట్టేలా చేస్తోంది ఓటు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యంత శక్తివంతులు అని నిర్వచించేది ఓటు. ఓటును అత్యంత శక్తియుతమైన గొప్ప ఆయుధంగా మార్చుకొని, మలచుకునే మార్పు అవసరం అనుకున్నపుడు విజ్ఞతతో, వివేకంతో ఆలోచించి ఓటు వేస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం కలగలిసినా ఓటరుగా మాత్రం ఒక్కటవుతున్నారు. తెలివి, ప్రజ్ఞ, వివేకం, చైతన్యం, ఆలోచనా శక్తి, విశ్లేషణాసక్తి వంటి అస్త్రాలతో ఓటరు విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. 

ఓటరు దేవోభవ

దేశంలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి పాలై నూతనంగా ఆవిర్భవించిన జనతాపార్టీకి ప్రజలు తమ చైతన్యంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. గత నాలుగున్నర దశాబ్దాల నాడే ఓటరు తన విఙ్ఞతను ప్రద ర్శించాడు. రాజకీయ నాయకులు పోటీలో ఉన్న అభ్యర్థులు ‘పాహిమాం.. పాహిమాం మహాప్రభో.. కరుణించు స్వామి’ అంటూ ఓటరుని వేడుకుంటున్న విషయం మనకు విదితమే. అంటే, ఓటు ఎంత శక్తివంతమో వేరుగా చెప్పనక్కరలేదు. ఆ తరువాత 2004లో దేశంలో జరిగిన ఎన్నికలలో అప్పటి బీజేపీ వాజపేయి నేతృత్వంలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో ‘దేశం వెలిగిపోతోంది’ అనే నినాదాన్ని ప్రజలు తిరస్కరించి యూపీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. అంటే, ఓటరు ఎంతో తెలివిగా ఆలోచిస్తూ తమ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాడు. మనం ఇక్కడ చూడవలసింది ఓటుపై ఓటరుకున్న అవగాహన, విశ్లేషణ. 2023లో తెలంగాణలో జరిగిన ఎన్నికలలో గ్రామీణ ప్రాంత ఓటర్లు తమ చైతన్యాన్ని కనబరుస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించారు. ఇప్పుడు విడతల వారీగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలలో కూడా ‘ఓటరునూ, ఓటునూ అంత తేలిగ్గా తీసుకోవద్దు. ఎంతో అప్రమత్తంగా ఉండటం మంచిది’ అని ఎన్నికల బరిలో ఉన్న ఉద్ధండులకు ద్యోతకమవుతోంది, అయ్యింది కూడా. అక్షరాస్యులైతేనేమి, నిరక్షరాశ్యులైతేనేమి తమతమ అభిప్రాయాలను ఓటు రూపంలో స్పష్టం చేస్తున్నారు. 

ఎవరికి ఓటు వేయాలి?

ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎన్ని ఆశలు పెట్టినా, విజ్ఞతతో మాత్రమేగాక చైతన్యాన్ని మేళవించి ప్రజలు ఓటు వేస్తున్నారు. ఓటును అంకుశంగానూ మలు స్తున్నారు. తమపై దండయాత్ర చేసే మదపు టేనుగును కూడా ఓటు అనే ఔటుతో నియంత్రిస్తున్నారు. ఎన్ని సర్వేలు చేసినా, అంతుపట్టని నాడితో తీర్పును ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఓటును ప్రభావితం చేసే అంశాలు, అవకాశాలు ఎలా ఉన్నా, కూసింత వివేకంతోనే ఓటును వేసేవరకు చైతన్యాన్ని కనబరుస్తున్నారు. ఎన్ని కబుర్లు చెప్పినా ‘ఎవరికి ఓటు వేయాలి? ఎవరికి పట్టం కట్టాలి?’ అని తమకు కలిగిన అనుభవాల సారంతోనే వేలిపై సిరాచుక్క గర్వంతో మురిసేలా ప్రజాస్వామ్యానికి గర్వ కారణం అవుతున్నారు. రాజకీయ పార్టీలు ఎంత తెలివిగా వ్యవహరించినప్పటికీ ‘ఓటరు మహా తెలివైన వాడు సుమా’ అని భావించేలా ప్రజలు తీర్పునిస్తున్నారు. చక్కటి పరిశీలనాత్మక శక్తితో భారతావనిలో జరిగిన, జరుగుతున్న పరిణామాలను అవలోకనం చేసుకుని మరీ ఓటుతో గురిపెట్టి కొడుతున్నారు. దేశాన్ని ఎమర్జెన్సీ ఎలా ప్రభావితం చేసింది ఆన్న అంశం మొదలుకొని, ‘ఎవరెవరు ఏయే హామీలు ఇచ్చారు, ఇస్తున్నారు వాటిని ఎలా నిలబెట్టుకున్నారు, సామాన్యుడికి ఒరిగిందేమిటి, పాలకులు తీసుకున్న కొన్ని నిర్ణయాలవల్ల జనం ఏ విధంగా ఇబ్బంది పడ్డారు?’ అని అవలోకనం చేసుకుంటున్నారు.

అంతే బాధ్యత, అదే ముందుచూపు

భారతదేశంలో ఓటు అనేది ప్రతి ఒక్కరూ బాగా ఆలోచించి వేసే దశకు ఇంకా చేరుకోవాల్సివుంది. అయితే, ఇంతవరకూ గుంపులను ఎవరు ఎక్కువ ప్రభావితం చేయగలిగితే వారివైపు గాలి వీస్తూ వస్తోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఓటు వేసే పండుగ, ఓటర్‌కి మార్పు తెచ్చే ఓ పెద్ద పండుగగా పరిణమించింది. ‘ఏదో, ఏదో చెప్పి అలా నెట్టుకొద్దాం’ అని ఆలోచించే రాజకీయాలకు చెల్లు చీటి రాసి ఇస్తున్నారు ఓటరు. మొత్తం మీద ఓటరు తన చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. వచ్చే ఐదేళ్లలో తమ సంక్షేమం, సమస్యలను పరిష్కరించడంలో ఆయా పార్టీలు చూపే చొరవ, ఆసక్తి, పార్టీల ప్రణాళిక, రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకు కంకణబద్ధులైన వారిని, ప్రజల గోడు వినేవారిని ఎన్నుకోవడం ద్వారా ఓటరు చూపే విఙ్ఞతను ప్రశంసించాల్సిందే. సరైన నాయకులను కలిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఓటుతో మీట నొక్కి తన వంతు గురుతర పాత్ర పోషించగల ఓటరు ఈసారి కూడా అదే ముందుచూపుతో సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోగలడని ఆశిద్దాం.

మాచన రఘునందన్

వ్యాసకర్త సెల్ : 94412 52121