కాలేజీల పేర్లు మార్చడం ప్రతీకార చర్యే
- జగన్ బాటలోనే చంద్రబాబు నాయుడు
- ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): రాష్ట్రంలో వైద్య, విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం జగన్ గతంలో తప్పు చేస్తే, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదే బాటలో నడుస్తున్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి విమర్శించారు. శనివారం ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు, ఆసుపత్రులకు దివంగత మాజీ సీఎం వైఎస్‌ఆర్ పేరు తొలగించడాన్ని ప్రతీకార చర్యలుగా పేర్కొన్నారు.
ఎన్టీఆర్ అయినా, వైఎస్‌ఆర్ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిక పాటు పడిన నాయకులేనని, వారి పాలన లో తమదైన ముద్రవేశారని గుర్తు చేశారు. వారి ని రాజకీయాలకు అతీతంగా చూడా లి తప్ప నీచ రాజకీయాలు ఆపాదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ తీసుకువచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణమాఫీ, ఉచిత కరెంటు, పెన్షన్లు ఇలా ప్రతి పథకం దేశానికి ఆదర్శంగా నిలిచినట్లు పేర్కొన్నారు. ఆయన ఏదో ఒక పార్టీ కి సొంతం కాదని, తెలుగు వారి గుండెల్లో వైఎస్‌ఆర్ స్థానం ఇప్పటికీ పదిలంగా ఉందన్నారు. వైసీపీ మీద ఉన్న కోపాన్ని వైఎస్‌ఆర్ మీద రుద్దడం సరికాదని కూటమి ప్రభుత్వానికి ఆమె హితువు పలికారు.






