గణపతిరెడ్డి ఉంటారా?
- ఆర్ అండ్ బీ ఈఎన్సీ భవితవ్యంపై అనుమానాలు
- బీఆర్‌ఎస్ హయాంలో అన్ని పనుల్లో అంచనాలు పెంపు
- సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంచనాలపై సీఎం సీరియస్
- శనివారంతో ముగిసిన గణపతిరెడ్డి 5 రోజుల సెలవు
- మళ్లీ విధుల్లోకి తీసుకొంటారా? ఇంటికి పంపుతారా?
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): రోడ్లు, భవనాల శాఖలో ఆయన చాలా పెద్ద అధికారి. 2017లో ఈఎన్సీగా పదవీ విరమణ చేసినా నాటి సర్కారు అండతో తిరిగి అదే కొలువులో కొనసాగారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆర్ అండ్ బీ శాఖలోని అత్యంత ముఖ్యమైన నిర్మాణాలన్నీ ఆయన చేతుల మీదుగానే సాగాయి. సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, కొత్త కలెక్టరేట్లతోపాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పి టల్, హైదరాబాద్‌లో టిమ్స్ నిర్మాణాలన్నీ ఈయన ఆధ్వర్యంలోనే సాగాయి. ఈ శాఖ (బిల్డింగ్స్ డివిజన్)పై ఉన్న ప్రధాన ఆరోపణ పెద్ద పనుల్లో అడ్డగోలుగా అంచనాలు పెంచేయడం.
గణపతిరెడ్డి బాస్‌గా శాఖ ముఖ్యమైన పనులన్నీ అలాగే అంచనాలను పెంచేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు ౨౭న సీఎం దవాఖానల నిర్మాణంపై సమీక్ష జరిపారు. ఎలాంటి సహేతుకత, పేపర్‌వర్క్ చూపించకుండా అంచనాలు భారీగా పెంచేశారని సీఎం గుర్తించారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ నిర్మాణంలో ఊహించని పెంపులు చూసిన సీఎం వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆ రోజు నుంచి ఆగస్టు 31 వరకు ఈఎన్సీ గణపతిరెడ్డి సెలవులో ఉన్నారు. 5 రోజులపాటు వ్యక్తిగ త పనులపై వియత్నాం వెళ్లగా అందుకు ప్రభు త్వం అనుమతించింది. ఆయన సెలవు ముగిసిన నేపథ్యంలో మళ్లీ ఈఎన్సీగా విధుల్లో ఉండేందుకు ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం ఆగ్రహం
ఆగస్టు 27న వైద్యారోగ్య శాఖ అధికారులతో దవాఖానలపై నిర్వహించిన సమీక్ష సందర ్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ హెల్త్ సిటీ, సనత్ నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్‌ల అంచనాల ను ఊహించని విధంగా పెంచిన తీరుపై ఆగ్ర హించారు. వరంగల్‌లో 24 అంతస్తుల్లో రూ. 1,100 కోట్లతో పనులు చేపట్టి ఏకంగా రూ. 1,726 కోట్లకు అంచనాలు పెంచేసిన తీరుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న 3 టిమ్స్‌ల అంచనాలను సైతం భారీగా పెంచేశారు.
వీటిని రూ.2,679 కోట్లతో ప్రారంభించగా, రూ.3,562 కోట్లకు అంచనాలు పెంచారు. వరంగల్ హెల్త్ సిటీ రూ.626 కోట్లు, టిమ్స్ రూ.883 కోట్లు కలిపి రూ.1,509 కోట్లను పేపర్లపైనే అంచనాలు పెంచేసినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీలు, సమీకృత కలెక్టరేట్ల పనుల అంచనాను సైతం అదే రీతిలో పెంచినట్టు సీఎం దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది.
అన్నీ గణపతిరెడ్డి హయాంలోనే
రాష్ట్రంలో పెద్దపెద్ద నిర్మాణాలన్నీ ఈఎన్సీ గణపతిరెడ్డి హయాంలోనే జరిగాయి. వరంగల్ హెల్త్ సిటీ, హైదరాబాద్‌లోని 3 టిమ్స్‌ల అంచనాల పెంపు వ్యవహారాలన్నీ గణపతిరెడ్డి పరిధిలోనివే. గణపతిరెడ్డి 5 రోజుల సెలవు శనివారంతో ముగిసింది. ఆదివారం సెల వు కావడంతో సోమవారం విధుల్లో చేరాల్సి ఉంది. ఆయన తిరిగి విధుల్లో చేరేందుకు సర్కారు ఒప్పుకునేందుకు సిద్ధంగా లేనట్లు సమాచారం. ఆర్‌అండ్‌బీలోని కొందరు అధికారులు సైతం ఆయన తీరుపై సీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గణపతిరెడ్డి తిరిగి విధుల్లోకి వస్తారా? లేదా? అనే అంశంపై ఆర్‌అం డ్‌బీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.






