7 May, 2026 | 12:54 PM

ఏపీలో భారీ వర్షాలు

01-09-2024 01:32 AM
  1. విజయవాడ అతలాకుతలం 
  2. జలదిగ్భందంలో హైకోర్టు 
  3. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు 

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడ నగరం అతలాకులమైంది. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ లో కొండ చరియలు విరిగిపడి ప్రోటోకాల్ కార్యాలయం, డోనల్ సెల్ ధ్వంసమయ్యా యి. నిన్న రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఘాట్‌రోడ్‌లో పలు చోట్ల కొండచరియలు పడ్డాయి. అక్కడ భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఉదయం నుంచి ఘాట్ రోడ్డును మూసివేశారు. మధ్యాహ్నం కూడా భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. బండరాళ్లు పడి దుర్గగుడి సమీపంలోని సమాచారం కేంద్రం వద్ద ఉన్న ప్రోటోకాల్ కార్యాలయం పూర్తిగా నేలమట్టమైంది. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్  బస్సు లను ఎక్కడిక్కడే నిలిపేవేశారు. 

కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. 

భారీ వర్షాలకు ప్రభుత్వం సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్‌ఏ అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో 19మంది అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లా లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు ప్రాంతాలకు నలుగురు అధికారులను నియమించారు. ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్‌కు కోన శశిధర్‌ను  నియమించారు. సీసీ కెమెరాల ద్వారా వరద పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు, ఆర్‌అండ్ బీ, విద్యుత్, మున్సిపల్ శాఖలు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

జలదిగ్భందంలో హైకోర్టు

ఏపీ రాజధాని అమరావతిలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. దీంతో రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలు నీట మునిగాయి. నేలపాడులో ఏపీ హైకోర్టు జలదిగ్భందంలో చిక్కుకుంది. ఉదయం నుంచి కుండపోత వర్షం కురవడంతో హైకోర్టు ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరింది. చుట్టు ప్రాం తాలు కూడా తడిసి ముద్దయ్యాయి.