అచ్చంపేట సర్వసభ్య సమావేశం గందరగోళం
ఎజెండా ప్రతులు లేకపోవడంపై ప్రజాప్రతినిధుల అసంతృప్తి
ఖాళీ కుర్చీలు ఉండటంపై ఎమ్మెల్యే ఆగ్రహం-
మీటింగ్‌కు వచ్చిన సర్పంచ్ భర్తను బయటకు పంపిన పోలీసులు
అచ్చంపేట, జూలై 31: అచ్చంపేట మండల సర్వసభ్య సమావేశం అధికారుల నిర్లక్ష్యంతో వివాదాస్పదంగా మారింది. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఎజెండా ప్రతులు పంపిణీ చేయకుండా సమావేశం నిర్వహించడంతో స ర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో గ్రామాల సమస్యలపై చర్చించేందుకు అవకాశం లేకుండా అధికారుల నివేదికలు విన డానికే పరిమితమయ్యారు.
సమావేశం మధ్యలో కొందరు అధికారులు, పంచాయతీ కార్యదర్శులు వెళ్లిపోవడంతో ఖాళీ కుర్చీలు కనిపించాయి. దీనిపై ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సమావేశం ముగిసే వరకు అందరూ తప్పనిసరిగా హాజరై ఉండాలని ఆదేశించారు. సర్పంచులు సమావేశాలకు హాజరు కాకపోతే పదవులకు రాజీనామా చేయాలన్నారు. సమావేశంలో పాల్గొన్న ఘనపూర్ సర్పంచి భర్త పదేపదే మాట్లాడటంతో ఎమ్మెల్యేతో వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆయనను సమావేశ మందిరం నుంచి బయటకు పంపించారు.






