1 August, 2026 | 1:06 AM

పాడి పరిశ్రమపై విస్తృత అవగాహన కల్పించాలి

01-08-2026 12:00 AM

కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్ జులై 31 (విజయక్రాంతి): జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల పనితీరుపై జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రైతులకు ప్రభుత్వ రాయితీలు, సబ్సిడీలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఏఈఓ తమ క్లస్టర్ లో 100 ఎకరాల్లో కూరగాయల సాగు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కూరగాయల సాగుకు ఎకరానికి రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ప్రభుత్వం రాయితీ అందిస్తోందన్నారు.

ఉద్యాన పంటలు, డ్రిప్ ఇరిగేషన్, మొక్కల పంపిణీ, ఆయిల్ పామ్ సాగు, పాడి పరిశ్రమపై గ్రామ స్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగుకు అనుకూల ప్రాంతాలను గుర్తించి రైతులను ప్రోత్సహించాలని సూచించారు. రైతులను నేరుగా కలుసుకుని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సలహాలు సకాలంలో అందేలా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షణ పెంచాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, హార్టికల్చర్ అధికారి వెంకటేశం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. జ్ఞానశేఖర్ తదితర అధికారులు పాల్గొన్నారు.