ప్రసాద్ దవాఖానలో సంతాన వైఫల్యం!
వైద్యం వికటించి వివాహిత మృతి
భర్త ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి
శ్మశాన వాటికలోనే పోస్టుమార్టం చేసిన వైద్యులు
ప్రసాద్ హాస్పిటల్ నిర్వాహకులపై కేసు నమోదు
కూకట్‌పల్లి, జూన్ 7 : సంతానోత్పత్తి కోసం ఆస్పత్రికి వెళ్లిన వివాహిత మృతి చెందిన సంఘటన కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట్ కుందన్‌భాగ్‌లోని వామన్ నాయక్ లేన్‌లో కరుణాకర్‌రెడ్డి, భార్య మేరీ పరిణీత (38)తో నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం లేదు. దీంతో కెపిహెచ్‌బి కాలనీలోని ప్రసాద్ ఆస్పత్రిలో తొమ్మిది నెలలుగా చికిత్స పొందుతోంది. గత నెల 31వ తేదీన హాస్పిటల్‌లో డాక్టర్ నీరజవల్లిని సంప్రదించారు.
టెస్టుల కోసం పరిణీతను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. ఏం జరిగిందో ఏమోగానీ, గుండెనొప్పి వచ్చిందని నర్స్‌తో భర్త కరుణాకర్‌రెడ్డికి సమాచారం అందింది. కరుణాకర్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకునేలోపే పరిణీతి మృతదేహాన్ని అంబులెన్స్‌లో యశోద ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధం చేశారు. పరిణీత డిశ్చార్జ్ సమ్మరీ షీట్ ఇవ్వమని కోరినా ఇవ్వకుండా అక్కడి నుంచి తరలించారు. యశోద ఆస్పత్రిలో పరిణీత ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని, ఆపరేషన్ చేయాలని వైద్యులు పేర్కొన్నారు.
ఎక్మో కోసం తరలిస్తుండగా మరోసారి పరిణీతకు గుండెనొప్పి వచ్చినట్లు వైద్యులు చెప్పారు. కాసేపటికి పరిణీతి మృతి చెందినట్లు పేర్కొన్నారు. ప్రసాద్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య మృతి చెందిందని కరుణాకర్‌రెడ్డి.. భార్య మృతదేహంతో ప్రసాద్ ఆస్పత్రి వద్దకు వెళ్లారు. వైద్యులను నిలదీశారు. తర్వాత మాట్లాడదామని సముదాయించి, ఖననం చేసేలా ఒప్పించారు. అంత్యక్రియల తర్వాత ఈ నెల 2న కరుణాకర్‌రెడ్డి ప్రసాద్ దవాఖానకు వెళ్లాడు.
రిపోర్టు కావాలని అడిగాడు. గ్రాండ్ సితార హోటల్‌లో మాట్లాడదామని చెప్పిన డాక్టర్లు సతీశ్, నీరజవల్లీ.. కరుణాకర్‌రెడ్డితో బేరసారాలకు దిగారు. తన భార్య చావుకు వారే కారణమని నిర్ధారణకు వచ్చిన కరుణాకర్‌రెడ్డి.. ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శుక్రవారం శ్మశానవాటికలో పరిణీత మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోంటామని పోలీసులు చెప్పినట్లు కరుణాకర్‌రెడ్డి తెలిపారు.






