07-01-2026 12:00:00 AM
సంక్రాంతి పండుగ వస్తున్న సందర్భంగా యువత, పిల్లలకు సెలవులు రానున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెలంగాణలో నగరాల్లో, పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో గాలి పటాలు ఎగురవేయడం చూ స్తుంటాం. అయితే ఆ పతంగులు ఎగుర వేసేందుకు పదునైన మాంజా దారా న్ని ఉపయోగిస్తున్నాం. అయితే గతంలో పతంగులు ఎగురవేసేటప్పుడు సాధారణం దారాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ కాలక్రమేణా చైనా మంజా తన ఆధిపత్యాన్ని చూపించడం ప్రారంభించింది.
గాజు సీసాల పొడితో తయారయ్యే చైనా మాంజాతో అటు పక్షులకు, ఇటు మానవాళికి ముప్పు పొంచి ఉంది. గాలిపటాలు ఎగురవేసే సమయంలో చైనా మాంజా కరెంటు వైర్లకు, చెట్లకు చిక్కుకొని రోడ్ల మీద వేలాడుతూ ఉంటుంది. అయితే ఈ మాంజా కంటికి కనిపించకపోవడంతో బైకులు, సైకిళ్లపై వెళ్లేవారికి అడ్డుగా తగులుతున్నాయి. పదునుగా ఉండడంతో గొంతు తెగి ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇప్పటికే ఎన్నో పక్షులు అంతరించి పోయే తరుణంలో ఉన్నాయి.
దీనికి చైనా మాంజా కూడా తోడవ్వడంతో పక్షులు ప్రమాదాలకు గురయ్యి చనిపోతున్నాయి. ప్రతీసారి ప్రభుత్వాలు, పోలీసులు చెబుతున్నప్పటికీ చైనా మాంజా వినియోగం మాత్రం ఆగడం లేదు. కానీ దీనికి స్వస్తి పలకాల్సిన అవసరం ఏర్పడింది. చైనా మాంజా స్థానంలో సాధారణ దారాన్ని ఉపయోగించి పతంగులు ఎగురవేయాలి. సంబంధిత అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా షాపుల వద్దకు వచ్చి చైనా మాంజాను అమ్మకుండా కట్టడి చేయాల్సిన అవసరముంది.
మిద్దె సురేశ్, నాగర్ కర్నూల్