calender_icon.png 8 January, 2026 | 1:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందుబాబుల ఆగడాలను అడ్డుకోవాలి

07-01-2026 12:00:00 AM

బహిరంగ ప్రదేశాల్లో మందుబాబుల ఆగడాలు రోజురోజుకు మరింత శృతి మించిపోతున్నాయి. రోడ్లపై మద్యం తాగొద్దని, మద్యం తాగి వాహనాలు నడపొద్దని అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ పరిస్థితిలో మాత్రం ఏ మార్పు రావడం లేదు. దీనికి తోడు అధికారుల తనిఖీలు అంతంతమాత్రంగానే ఉండడంతో మందుబాబులకు పూర్తిస్వేచ్ఛ లభించినట్లయింది. చీకటిపడ్డాకా జనావాసాల్లోనే మద్యం తాగుతున్నారు. జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.

మద్యం మత్తులో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా రహదారులపై వచ్చి పోయే వారితో గొడవలకు దిగడం, మహిళలు, యువతులతో అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో రాత్రి పూట మద్యం తాగి, ఆ తర్వాత సీసాలు పగులగొట్టి విసిరేస్తున్నారు. అయితే మద్యం అమ్మకాలు జరిగే వైన్ షాపుల వద్ద పర్మిట్‌రూం అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది వాటిని ఉపయోగించుకోవడం లేదు. మందు కొనుగోలు చేసి రహదారుల పక్కన, జనావాసాలు ఉంటున్న చోటుకు వెళ్లి తాగుతున్నారు.

మద్యం మత్తులో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఎదుటివారితో వాగ్వాదం పెట్టుకోవడం చేస్తున్న మందుబాబులు వికృత చర్యలతో అటుగా వెళ్లేవారు, స్థానికంగా నివాసముండేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగిన మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. నగరాల్లో పరిస్థితి వేరుగా ఉన్నప్పటికీ జిల్లా, మండల కేంద్రాల్లో మాత్రం పోలీసులు నెలవారీ మాముళ్లు తీసుకుంటూ పేరుకు పెట్రోలింగ్ నిర్వహిస్తూ చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి మందుబాబుల ఆగడాలను అరికట్టాలి.

 కామిడి సతీష్, భూపాలపల్లి